పోడు భూమి కోసం పోరాటం చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి..

పోడు భూమి కోసం పోరాటం చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన మల్హర్ మండలం ఎడ్లపల్లిలో గురువారం జరిగింది.

Update: 2023-04-06 14:30 GMT

దిశ, మల్హర్: పోడు భూమి కోసం పోరాటం చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన మల్హర్ మండలం ఎడ్లపల్లిలో గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎడ్లపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజునాయక్ (35) అనే రైతు అటవీ నరికి కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటవీ హక్కు చట్టం ప్రకారం పట్టా పాసు పుస్తకాలు కలిగిన రాజు నాయక్ కు రైతుబంధు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. సొంత భూమి లేక అటవీ భూమిపైనే జీవానాధారంతో బతుకుతున్న ఈ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న రాజు నాయక్ మృతి చెందడంతో భార్య వనిత, ముగ్గురు కూతుళ్లు మమ్మల్ని ఆదుకునేది ఎవరని బోరున విలపిస్తున్నారు.

అయితే గతంలో ఈ అటవీ భూమి విషయమై భూమి సాగు చేస్తున్న తరుణంలో అటవీ శాఖ అధికారులకు రాజు నాయక్ కు వాగ్వివాదం జరగడం వల్ల ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో రాజు నాయక్ పురుగుల మందు సేవించాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు వైద్యం చేయించి ప్రాణాపాయం నుంచి కోలుకున్న రాజు నాయక్ తో నీ భూమి నీకే వదిలేస్తామంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి సాగు చేసుకునే భూమి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందంటూ నీకు దక్కేది లేదని బెదిరింపులకు పాల్పడడంతో రాజు నాయక్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు పోడు చేసుకుంటే పట్టా పాసు పుస్తకాలు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అటవీ శాఖ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి పోడుభూమి సాగు చేయకుండా బాధిత కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టడంతో రాజు నాయక్ మనోధైర్యాన్ని కోల్పోయి గుండెపోటుతో మృతి చెందేలా ఫారెస్ట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని భార్య వనిత ఆరోపించింది. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని సాగు చేసుకుంటున్న పోడు భూమికి అటవీశాఖ అధికారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేదాకా కదిలేది లేదంటూ, మృతదేహంతో కుల సంఘాల ఆధ్వర్యంలో భూపాల్ పల్లి ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఉదయం11 గంటల నుంచి సాయంత్రం వరకు నిరసన చేసినా అధికారుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో స్థానిక సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐలు భారీ పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్, లంబాడీల ఐక్య వేదిక జిల్లా ఇంచార్జి నాగరాజు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో గిరిజనులు చేరుకొని మృతి చెందిన కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కదిలేది లేదంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ శాఖ అధికారులు ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అన్నా చందంగా దాగి ఉన్నట్లు సమాచారం. మృతదేహంతో కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా పోలీసులు కాపు కాస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News