జోరుగా జీరో దందా.. నకిలీ నెంబర్ పేట్లతో ఇసుక తరలింపు
ములుగు జిల్లాలో ఇసుక జీరో దందా మళ్లీ పురుడు
దిశ,ఏటూరునాగారం: ములుగు జిల్లాలో ఇసుక జీరో దందా మళ్లీ పురుడు పోసుకుంటుంది. ప్రధాన చెక్ పోస్టుల వద్ద అనుమతి పత్రాలు లేకుండా ఇసుక లారీలు పట్టుబడుతున్నా నామమాత్రపు కేసులు నమోదు చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గతేడాది ఇదే తరహలో మొదలైన జీరో దందా చివరికి ఉన్నత స్థాయి అధికారుల రంగప్రవేశంతో భారీ స్థాయిలో కొనసాగినట్లు తేటతెల్లమైంది. ఇదే తరహాలో మళ్లీ ములుగు జిల్లాలో ఇసుక దందా కొనసాగుతున్నట్లు ఏజెన్సీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అనుమతి పత్రాలు లేకుండా, నకిలీ నెంబర్ ప్లేట్లతో ఇసుక లారీలు పట్టుబడుతుండడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆగస్టు 7న పస్రా అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద అనుమతి పత్రాలు లేకుండా పట్టుబడిన నాలుగు ఇసుక లారీలు, నూగురు వెంకటపూర్ పరిధిలో పోలీసుల తనిఖీల్లో నకిలీ నెంబర్ ప్లేట్‌తో ఇసుక తరలిస్తూ పట్టుబడిన లారీ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
వే బిల్లులు లేకుండానే ఇసుక తరలింపు..
ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాలైన నూగూరు వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో ప్రస్తుతం ఇసుక క్వారీలు కొనసాగుతున్నాయి. అలాగుచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న ఇసుక క్వారీల నుంచి లారీలు ములుగు జిల్లా మీదగానే రవాణా సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఓవర్‌లోడ్ తో ఇసుక తరలిస్తున్న లారీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50కి పైగా ఇసుక లారీలు పట్టుబడ్డాయి. కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొరవడడంతో వే బిల్లులు లేకుండానే ఇసుక లారీలు జిల్లాలు దాటుతున్నట్లు ఏజెన్సీలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
క్వారీల్లో కొరవడిన తనిఖీలు..
ఇసుక క్వారీల్లో అక్రమాలు బహిరంగంగా జరగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలపై పలుమార్లు పత్రికల్లో ప్రచురించినా కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. క్వారీల్లో తనిఖీలు నిర్వహించిన సమయంలో అక్రమాలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరినా మౌనం ప్రదర్శిస్తూ గోప్యత పాటించడం పులు అనుమానాలకు తావిస్తోంది.
అరికట్టేందుకు అధికారుల కసరత్తులు..
ఇసుక క్వారీల్లో అక్రమాలను నియత్రించడానికి సంబంధిత శాఖ అధికారులు కొత్త ప్రణాళికలు అమలుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జీరో దందా, నకిలీ నెంబర్ ప్లేట్లతో ఇసుక తరలింపు, ఓవర్‌లోడ్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ విషయమై అటవీ, పోలీస్, రెవెన్యూ, టీజీ ఎండీసీ శాఖల అధికారులు సైతం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
ప్రత్యేకంగా చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది..: బాలరాజు, పస్రా అటవీ శాఖ రెంజ్ అధికారి
వే బిల్లులు లేకుండా ఇసుక తరలింపుపై దృష్టిసారించాం. టీజీఎండీసీ, మైనింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రతి చెక్‌పోస్ట్ వద్ద ప్రత్యేకంగా ఇసుక లారీల తనిఖీల కోసం సిబ్బందిని కేటాయించనున్నాం. టీజీఎండీసీ నుంచి క్వారీల్లో ఇసుక కోసం బుక్ చేసుకున్న లారీల వివరాలు ఆన్‌లైన్ ద్వారా అటవీ శాఖకు అందేలా చర్యలు చేపడుతున్నాం. తద్వారా ఇసుక అక్రమ రవాణా కు చెక్ పెట్టగలం.
చెక్‌పోస్టుల వద్ద ఫాస్ట్‌ట్యాగ్..: అబ్దుల్ రెహమాన్, ఏటూరునాగారం ఎఫ్ఆర్‌వో
ప్రస్తుతం చెక్ పోస్టుల వద్ద అటవీ, పర్యావరణ సంరక్షణ రుసుము రూ.100 నుంచి రూ.200వసూలు చేస్తూ రశీదులు అందిస్తున్నాం. ఈ క్రమంలో వాహనాల రద్దీ నెలకొంటుంది. దీన్ని అరికట్టే దిశగా ఫాస్ట్ ట్యాగ్, స్కానర్ విధానం అమలు చేయడానికి ప్రణాళిక చేస్తున్నాం. దీంతో లారీల నెంబర్లు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ట్రాఫిక్ రద్దీ నియత్రించవచ్చు.
అక్రమ రవాణాపై చర్యలు : జగదీశ్, ఏటూరునాగారం ఎంఆర్‌వో
ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయనున్నారు. అప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం.
తనిఖీలు నిర్వహిస్తున్నాం.. : తాజుద్దీన్, ఏటూరునాగారం ఎస్సై
ఎస్పీ ఆదేశాల మేరకు నిత్యం ఇసుక లారీల తనిఖీలు నిర్వహిస్తున్నాం. చెక్‌పోస్టుల వద్ద ఓవర్‌లోడ్ లారీలపై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నాం. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసిన వారపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.