అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం... వాహనదారుల ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండల కేంద్రం నుంచి మరిపెడ మండలంలోని ఎల్లంపేట స్టేజ్ వరకు 10 కిలోమీటర్లకు 3 కోట్ల రూపాయలతో బీటి రోడ్ నిర్మాణాన్ని గత మూడు నెలల క్రితం ప్రారంభించి పూర్తి చేశారు.

Update: 2023-07-09 07:57 GMT

దిశ, మరిపెడ /చిన్నగూడూర్ : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండల కేంద్రం నుంచి మరిపెడ మండలంలోని ఎల్లంపేట స్టేజ్ వరకు 10 కిలోమీటర్లకు 3 కోట్ల రూపాయలతో బీటి రోడ్ నిర్మాణాన్ని గత మూడు నెలల క్రితం ప్రారంభించి పూర్తి చేశారు. కానీ చిన్నగూడూరు మండలం నుంచి ఉగ్గంపల్లి గ్రామం గుండా వెళ్లే మార్గంలో సుమారు 100 మీటర్లు కంకర రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు, రోడ్డుకు ఇరుపక్కల గల గృహాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నడిపే క్రమంలో చాలామంది వాహనాలు అదుపుతప్పి కింద పడి గాయాల అవుతున్నాయని వాహనాల టైర్లు సైతం పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎందుకింత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్డుకు ఇరుపక్కల నివసించేవారు వాహనాలు వెళ్లేటప్పుడు వచ్చే దుమ్ము దూళితో నరకం కనబడుతుందని దుస్తులు పిండి ఆరుబయట ఆరేస్తే మొత్తం దుమ్ము మాయం అవుతుందని అన్నారు.

ఈ దుమ్ము ధూళితో గొంతు, ముక్కు అలర్జీ వంటి సమస్యలు వస్తున్నాయని ఆసుపత్రుల పాలవుతున్నామని తెలిపారు. అంతేగాక వాహనాలు వెళ్ళేటప్పుడు కంకర రాళ్లు ఎగిరి వచ్చి బలంగా తగులుతున్నాయని ఇన్ని నెలలైనా అధికారులు స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉందంటూ ఆగ్రహంతో కూడిన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ సొంత గ్రామమైన ఆయన దృష్టికి ఎన్ని సార్లు తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. అలాగే మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామం పొలిమేరన కొంత మేర రోడ్డు ఒక భాగం పోయకుండా కంకర రాళ్లతో అలాగే వదిలేయడంతో ఇరుపక్కల నుంచి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళ ప్రయాణం చేసే క్రమంలో అటు నుంచి ఏదైనా పెద్ద వాహనం వస్తే దానిని తప్పించే క్రమంలో కంకర రాళ్ల నుంచే వెళ్లాల్సి వస్తుందని, అకస్మాత్తుగా బ్రేక్ లు కొట్టడంతో కిందపడి గాయాల పాలవుతున్నామని ఈ చిన్న పని కూడా పూర్తి చేయకపోతే ఎలా అంటూ ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఎల్లంపేట స్టేజ్ దగ్గర్లో కూడా కొంతమేర రోడ్డు పోయాల్సి ఉంది. అధికారులు పనితనాన్ని గమనిస్తున్న ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎండాకాలం పూర్తి అయి నైరుతి రుతుపవనాలతో వానాకాలం ప్రారంభం కాబోతుంది. మిగతా పనిని వానలలో పూర్తి చేస్తారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తు ఉదాహరణగా మరిపెడ మండలంలోని బోడ తండాలో అర కిలోమీటర్ రోడ్డు పూర్తికాక 10 ఏళ్ళు అవుతుంది అని అక్కడి ప్రజలు ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ప్రశ్నిస్తే మాకు తెలిసిందని అలాగే ఈ పని కూడా పూర్తి కావడానికి ఎన్ని ఏళ్ళు పట్టుతుందో అంటూ వారి సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గమనించి మిగతా పనిని పూర్తి చేస్తారో లేక లైట్ తీసుకుంటారు వేచి చూడాలి.

ఆర్ అండ్ బీఏఈ వివరణ..!

వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు ఆయ ప్రదేశాలలో బ్రిడ్జి పైనుంచి వర్షం నీరు పోతుండడంతోనే స్ట్రక్చర్ హై బాలిక్ పర్టిక్లర్ తీసుకొని సబ్మిట్ చేశారన్నారు. ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే మిగిత నాలుగు శాతం పనిని పూర్తి చేస్తామని వారు తెలిపారు.

Tags:    

Similar News