Governor Jishnu Dev Verma : కోటగుళ్లు అద్భుతం.. కాకతీయ వైభవాన్ని చాటేలా కట్టడాలు
కాకతీయులు నిర్మించిన కోటగుళ్లు ఎంతో అద్భుతంగా
దిశ,వరంగల్ బ్యూరో : కాకతీయులు నిర్మించిన కోటగుళ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని అన్నారు. మూడు రోజుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కోటగుళ్లను, గణపేశ్వరాలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈసందర్భంగా జిల్లాకు విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ కు వేదపండితులు పూర్ణ కుంభం, మేళా తాళాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావులతో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేదపండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గణపేశ్వరాలయం ఆవరణలో తవ్వకాల్లో బయటపడిన శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాకతీయుల వైభవాన్ని చాటే గొప్ప కట్టడం గణపేశ్వరాలయమని అన్నారు. సుమారు 12వ శతాబ్దంలో కాకతీయులు ఓరుగల్లు ప్రాంతాన్ని పాలించిన సమయంలో ప్రజల సౌకర్యార్థం అద్భుతమైన కట్టడాలను నిర్మించారని అన్నారు. కాకతీయులు ఇతర రాజ్యాల పై దండయాత్ర చేసి సాధించిన విజయానికి గుర్తుగా ఒక్కొక్క గుడిని నిర్మించారని తెలిపారు. కాకతీయుల కళా సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.