రెవెన్యూ డివిజన్ కల నెరవేరేదెన్నడో ?

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పరిసర ప్రాంత ప్రజలు మరిపెడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Update: 2024-12-19 04:44 GMT

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పరిసర ప్రాంత ప్రజలు మరిపెడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ చిరకాల కోరిక అయిన మరిపెడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ పెద్దఎత్తున వ్యక్తం అవుతోంది. మరిపెడ (19) చిన్నగూడూరు (05), నరసింహులపేట (09) రెవెన్యూ గ్రామాలను కలుపుకుని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ధరణి భూ సమస్యల తప్పిదాలను సరి చేసుకోవాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొర్రూర్ రెవెన్యూ డివిజన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు, ప్రజలు దూరం భారం తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్య కార్యాలయాలు, ఇతర కార్యకలాపాలకు ఈ ప్రాంతం అనువైనదనే అభిప్రాయం ఈ ప్రాంత ప్రజలు, రైతులు నుంచి వ్యక్తం అవుతోంది. అంతేకాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. కాగా, ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో సమస్య సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పరిసర ప్రాంత ప్రజలు తమ చిరకాల కోరిక మరిపెడ రెవెన్యూ డివిజన్‌గా ఎప్పుడు మారుతుందోనంటూ వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరిపెడ (19) చిన్నగూడూరు (05), నరసింహులపేట (09) రెవెన్యూ గ్రామాలను కలుపుకుని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ధరణి భూ సమస్యల తప్పిదాలను సరి చేసుకోవాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొర్రూర్ రెవెన్యూ డివిజన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. ముఖ్య కార్యాలయాలు, ఇతర కార్యకలాపాలకు అనువైన ప్రాంతమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనీ వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నాన్చుతున్న ధోరణి అవలంబిస్తే అఖిలపక్షం ఏర్పాటు చేసి సమస్య సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

కల నెరవేరేనా..?

చాలా ఏండ్ల నుంచి రెవెన్యూ డివిజన్ డిమాండ్ ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 నవంబర్ నెలలో మరిపెడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయబేరి సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నూతన మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో ప్రజలలో నెలకొన్న అనుమానాల పై శాసనసభలో చర్చ జరుగుతుంది. ఆలేరు, ఖానాపూర్, చేర్యాల ఎమ్మెల్యేలు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో ప్రసంగించారు. హామీ ఇచ్చి సంవత్సరం పూర్తవుతున్న వేళ ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురుస్తున్నాయి.

అనువైన ప్రాంతం...

డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ భాగమైనప్పటికీ ముఖ్య కార్యాలయాలు, రాజకీయ కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ ఈ ప్రాంతం నుంచే అధికంగా ఉంటాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఇరిగేషన్ డివిజన్, ఎస్‌టీఓ (ట్రెజరీ) కార్యాలయాలు, స్పోర్ట్స్ ఆడిటోరియం ఉమ్మడి జిల్లాలోనే మొదటిది, పెద్దదైన సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కూడా ఇక్కడే ఉంది. నాలుగు కూడళ్ల మధ్యలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచి మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు తక్కువ సమయంలోనే వెళ్లొచ్చు.

తగ్గనున్న దూరాభారం..

భూ సమస్యలు, ఇతర అవసరాల కోసం తొర్రూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయనికి వెళ్లాలంటే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఉదాహరణకు మరిపెడ నుంచి తొర్రూరు వెళ్లి అక్కడ నుంచి మళ్లీ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రావాలంటే సుమారు 100 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాలి. అదే మరిపెడ రెవెన్యూ డివిజన్‌గా మారితే సమయంతో పాటు దూర భారం కూడా తగ్గనుంది.

అఖిలపక్షం ఏర్పాటుకు సన్నద్ధం.!

అధికార, ప్రతిపక్ష పార్టీలు డివిజన్ ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్నప్పటికీ డివిజన్ సాధన ఆలస్యం అవుతుండడంతో అఖిలపక్షం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. మరి కొన్ని నెలల్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీనిని అస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇబ్బందులు పడుతున్నాం.. శ్రీనివాస్ రైతు మరిపెడ మండలం

కొన్ని కారణాల వల్ల నా భూమి డిజిటల్ అన్ సైన్ అయి ఉంది. మండల కేంద్రంలో తహశీల్దార్ అప్రూవల్ ఇచ్చినప్పటికీ ఆర్డీవో కార్యాలయం లాగిన్‌లో ఉంది. ఈ క్రమంలో ఆర్డీవోలు మారుతుండడంతో తప్పని పరిస్థితుల్లో ఒకటికి రెండుసార్లు తొర్రూర్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరిపెడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే మాకు ఈ ఇబ్బందులు తొలగిపోతాయి.


Similar News