ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించండి: కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
దిశ, ములుగు ప్రతినిధి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవీ గణేష్ లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి సమస్యలపై 15, పెన్షన్లు మంజూరుకు 8, రెండు పడకల గదుల కొరకు 6, ఇతర సమస్యలపై 14 దరఖాస్తులు రాగా మొత్తం 43 దరఖాస్తులు స్వీకరించారు. కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు.
వివిధ శాఖలకు చెందిన సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. వెంకటాపురం, కన్నాయిగూడెం మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు బిల్డింగ్ నిర్మాణం ప్రతి పాదనలు రూపొందించాలని, ఇంటర్మీడియట్ బోర్డ్ కో ఆర్డినేటర్ ప్రత్యేక దృష్టి సారించి పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల సంఖ్య సేకరించి వివరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటాపూర్ మండలంలోని ఎదిర రోడ్డు పనులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ రైతు వేదికలో లేబర్ మ్యానిడిటరీ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
రామప్పలో సీబీఎఫ్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ ప్రోగ్రాం పథకం కింద రామప్ప చుట్టుపక్క గ్రామాల యువతకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. అయా మండలాల్లో మంజూరైన అభివృద్ధి పనులు పెండింగ్ లో లేకుండా తగు చర్యలు తీసుకొనుటకు మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఎంప్లాయిస్ జనరేషన్ ప్రోగ్రాం పథకం కింద ప్రత్యేక చొరవతో మల్లూరు, బుసపూర్, మేడారం, నార్లాపూర్ గ్రామాలలో యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని అన్నారు. రామప్పలో మంజూరైన పనులు వాటి వివరాలు తెలపాలన్నారు.
పాలంపేట గ్రామంలో అంగన్వాడీ సెంటర్ గ్రామపంచాయతీ బిల్డింగ్ ప్రతిపాదనలు పంపించాలని, జిల్లా సంక్షేమ ఉద్యోగుల డైలీ రిపోర్ట్ హాజరు తప్పనిసరి నమోదు చేసుకోవాలన్నారు. నర్సాపూర్, రాజేశ్వరపల్లి రోడ్డు పనులు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు సక్రమంగా ఉండాలన్నారు. అందుకు మండల ప్రత్యేక అధికారులు ప్రతి మండలంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి శాఖ అధికారులు పనితీరుపై ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ అభినందించారు.
అభివృద్ధి కార్యకలాపాలు సజావుగా సాగేలా ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని, నీటిపారుదల శాఖకు సంబంధించిన నీళ్ల ట్యాంకులు ఏవైనా మరమ్మతులు ఉన్నట్లయితే వాటి వివరాలు తెలపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో రమాదేవి, ఆర్ అండ్ బీ ఈ వెంకటేష్, పీఆర్ఈ జగదీష్, ఇరిగేషన్ అధికారులు, జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరిటెండెంట్ జగదీశ్వర్, సీపీఓ ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి తదితరులు పాల్గొన్నారు.