ఇద్దరు కీలక నేతల మధ్య ఐక్యత రాగం..పొలిటికల్ వార్‌కు బ్రేక్..?
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల మధ్య
దిశ, వరంగల్ బ్యూరో : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్‌కు బ్రేక్ పడిందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కొద్దిరోజుల కింద వరకు ఉప్పు నిప్పుగా ఉన్న మంత్రి, ఎమ్మెల్యే మామునూరు ఎయిర్ పోర్ట్‌కు భూ సేకరణ సందర్భంగా గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులతో సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావాల్సిన 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ వస్తే స్థానిక ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడతాయో సోదాహరణంగా వివరించి, వారిని ఒప్పించారు. రైతులు, గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో ఎంతో సమన్వయంతో వ్యవహరించడం గమనార్హం. రాజకీయ వైరుధ్యాలు, ఆధిపత్య పోరుతో ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరించిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సఖ్యతతో ముందుకు సాగడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి టాస్క్‌తో రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టినట్లు సమాచారం.
ఆధిపత్యానికి ఆరాటం..!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్ మొదలు కాగా... తర్వాత కాలంలో క్రమంగా పొలిటికల్ వార్ పెరుగుతూ పోయింది. పరకాల నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు మంత్రి సురేఖ యత్నించడం, స్థానిక ఎమ్మెల్యేగా పట్టుకోల్పోకుండా ఉండేందుకు రేవూరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. దసరా వేడుకల సందర్భంగా గీసుగొండ మండలంలోని ధర్మారంలో రేవూరి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొంతమంది తొలగించడంతో ఘర్షణలకు దారితీసింది. కొండావర్గానికి చెందిన కొంతమంది నేతలు, రేవూరి అనుచరుల మధ్య గీసుగొండ మండలంలోని ధర్మారంలో ప్రత్యక్ష గొడవలు, బాహాబాహీలకు దిగడం, ఫ్లెక్సీల చించివేతతో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. అంతకు ముందు గీసుకొండ మండలంలో తనకు సంబంధం లేకుండానే నేతలను పార్టీలో మంత్రి సురేఖ చేరుస్తున్నారని ఎమ్మెల్యే రేవూరి గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపైనే ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఫోన్ ఆడియో సంభాషణ లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అలాగే కామారెడ్డిపల్లి శివారులో వరంగల్ పార్లమెంట్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం వివాదాన్ని మరింతగా పెంచింది. మంత్రి రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని కొండా వర్గీయులు నిలదీయడంతో ఘర్షణ ఏర్పడింది. ఇలా వరుస ఘటనలతో రేవూరి, కొండా సురేఖ వర్గీయులు ఉప్పు నిప్పుగా ఉంటూ వస్తున్నారు. ఒక దశలో మంత్రి కొండా సురేఖపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సైతం కలిసేందుకు ప్రయత్నించారు. అయితే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి జోక్యంతో పరిస్థితి సమసిపోయింది. అయితే ఓ నలుగురు ఎమ్మెల్యేలతో మాత్రం కోల్డ్‌వార్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పరకాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మాత్రం ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
మామునూరు మార్గం...
ఓరుగల్లు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రధానంగా మామునూరు ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభిస్తామని వాగ్దానం చేసింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. చెప్పినట్లుగానే మామునూరులో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు జీఎంఆర్ నుంచి ఎన్‌వోసీ కూడా లభించినట్లుగా తెలుస్తుండడంతో భూ సేకరణ పూర్తి చేస్తే ఎయిర్ ఇండియా ఆఫ్ అథారిటీ(ఏఐఏ) విమానాశ్రాయ ఏర్పాటుకు వెంటనే స్పందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామంతో విమనాశ్రయానికి భూ సేకరణతోపాటు ఇతర అంశాల్లో సానుకూలత తీసుకొచ్చే బాధ్యత జిల్లా మంత్రిగా కొండా సురేఖపై, భూ సేకరణ జరగాల్సిన రెండు గ్రామాలు పరకాల నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఎమ్మెల్యే రేవూరిపైనే పడింది. విమానాశ్రయం ప్రారంభం అనేది జిల్లా అభివృద్ధికి దోహదం చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి అసెట్‌గా మారనుంది.
ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా భూ సేకరణ చేపట్టాలని మంత్రిగా కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి, నాగరాజు, నాయినిలకు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూ సేకరణ నిమిత్తం స్థల పరిశీలన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతానికి వర్గ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి సమన్వయంతో పార్టీ, ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న భూ సేకరణ అంశాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో వర్గాలు చాలా కామన్‌గా ఉండేవే.. అది మా కల్చర్ అంటూ ఓ నేత ప్రస్తుతం కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గ విబేధాలపై కామెంట్ చేయడం గమనార్హం.