దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో, ములుగు చుట్టుపక్కల మండలాల్లో నాటు సారా తయారీ, అమ్మకాలు జోరుగా జరుగుతున్న వాటిని కట్టడి చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేయకుండా గుడుంబా తయారీ దారులు ఇచ్చే తాయిలాలకు ఆశపడి మౌనం వహిస్తూ, నెల నెల ముడుపులకు ఆశపడుతూ నాటు సారా కట్టడి విస్మరిస్తున్నారు. జిల్లాలోని వైన్ షాప్ ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకొని నెల నెల మామూలకు ప్రాధాన్యమిస్తూ వైన్స్ లో నామ మాత్రపు తనిఖీలను నిర్వహిస్తూ, పల్లెల్లో బెల్టు షాపులకు అండగా నిలుస్తూ, బెల్ట్ షాపులలో సైతం ప్రైవేటు సిబ్బందితో మామూల వసూళ్లకు దిగుతున్నారని ఎక్సైజ్ అధికారులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సారా కట్టడిలో చేతివాటం..
చిన్నా మధ్యతరగతి కుటుంబాలను చిదిమేస్తున్న గుడుంబాని ఉక్కు పాదంతో అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న. ములుగు ఏజెన్సీ జిల్లా కావడంతో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే జిల్లాలో పల్లె ప్రాంతాల్లో నాటు సారా తయారీ కట్టడిలో అధికారుల అలసత్వనికి ముఖ్య కారణం అధికారులకు అందే మామూలే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పల్లెల్లో గుడుంబా తయారు చేసే కుటుంబాల వద్ద ఎక్సైజ్ అధికారులు మామూలు వసూలు చేస్తూ దాడులకు దూరంగా ఉంటున్నారని, అడిగిన మామూలు ఇవ్వని వ్యక్తిపై పదేపదే దాడులు నిర్వహించి వాళ్ళ దారికి తెచ్చుకుంటూ, మామూలు ముట్టజెప్పిన వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.
ఇదివరకు పల్లెలకే పరిమితమైన గుడుంబా ఇప్పుడు ములుగు జిల్లా కేంద్రంలో సైతం విరివిగా లభిస్తోంది. పల్లెల్లో కాచిన నాటుసారా రాత్రిళ్లు అక్రమంగా జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కూడా రవాణా చేస్తున్న ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తులో ఉండటం విశేషం. ములుగు జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో నాటు సారా విక్రయ కేంద్రాలు ఉన్న వాటిపై చర్య తీసుకోకుండా మామూళ్లకు ఆశపడి వదిలేస్తున్నారని జిల్లా కేంద్రంలో చర్చ జరుగుతుంది.
వైన్ షాపులకు అధికారుల అండ..
ములుగు ఎక్సైజ్ సిబ్బంది జిల్లా కేంద్రంలోని వైన్ షాప్ యజమానులతో కుమ్మక్కై ఒప్పందం కుదుర్చుకొని వైన్ షాప్ లో తనిఖీలను నామమాత్రంగా నిర్వహిస్తూ నిబంధనలకు మంగళం పాడి వైన్ షాప్ యజమానులతో చేతులు కలిపి బెల్ట్ షాప్ నిర్వహణకు అభయవిస్తు ఊళ్లల్లో బెల్ట్ షాపులకు ఊతమిస్తున్నారని ఆయా గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వాహకుల దగ్గర నెలవారి మామూళ్లకు ఆశపడి బెల్ట్ షాపుల కట్టడి విస్మరిస్తూ మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు ఉన్నారని, గ్రామాల్లో బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న తమకేమీ తెలియదు అన్నట్టు వ్యవహరించడం, మామూలు ముట్టజెప్పని వారిపై పదేపదే దాడులకు పాల్పడి ఎలాగైనా వారిని తమ దారిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎక్సైజ్ అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
వైన్స్ యాజమాన్యం ప్రైవేట్ సిబ్బందిని బెల్టు షాపుల్లో పంపించి తమ మద్యం మాత్రమే అమ్మాలంటూ దౌర్జన్యానికి దిగుతున్న, రాత్రి వేళల్లో బెల్ట్ షాపు యజమానులపై దాడులకు దిగుతున్న అటుగా కన్నెత్తి చూడకపోవడం అటు నుంచి బాధితుని పైనే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం ఎక్సైజ్ సిబ్బంది చేతివాటాన్ని బహిర్గతం చేస్తోంది.
ప్రైవేట్ సిబ్బందితో మామూళ్ల వసూలు..
ములుగు ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న ప్రైవేటు సిబ్బందిని మామూళ్లకు వినియోగిస్తూ ఎలాంటి మరక తమ చేతికి అంటకుండా ఎక్సైజ్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే ప్రైవేటు సిబ్బందినకి నెలనెలా మామూలు వచ్చే వారి వివరాలను అందించి మామూళ్ల వసూళ్లకు వినియోగిస్తూ, వాళ్లకు మాత్రమే ముడుపులు ఇచ్చే విధంగా జారీ చేస్తున్నారని, ఇలా ప్రైవేటు సిబ్బందిని వినియోగించడం వల్ల తమ చేతికి ఎలాంటి మట్టి అంటకుండా జాగ్రత్త పడుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముడుపుల వ్యవస్థ నడుస్తుందని జిల్లా కేంద్రంలో చర్చ జరుగుతోంది.