సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం

రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Update: 2025-04-02 12:36 GMT
సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం
  • whatsapp icon

దిశ,జనగామ : రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ తో కలిసి కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకంపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారని, వాటి ద్వారా 2 కోట్ల 81 లక్షల 50 వేల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు.

    రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి నిరుపేదకు కడుపునిండా నాణ్యమైన సన్న బియ్యం బువ్వను అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. అలాగే ఈ పథకం పక్కదారి పట్టకుండా ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 335 రేషన్ దుకాణాల ద్వారా 1,61,264 రేషన్ కార్డుల లబ్ధిదారులకు 3,151 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

    ఈ సందర్భంగా ఘన్​పూర్, జాఫర్గడ్, చిల్పూర్, రఘునాథపల్లి మండలాల వారీగా పలువురు లబ్ధిదారులకు ఈ సందర్భంగా సన్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఇంఛార్జి డీసీఎస్ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, డీఎం సీఎస్ హతీరాం, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, సరస్వతి, శంకరయ్య, ఇతర సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు. 

Similar News