పల్లాకు కుదరని సమీకరణం.. ముత్తిరెడ్డి వర్గీయులను పట్టించుకోని నేత
జనగామ నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి
దిశ, వరంగల్ బ్యూరో : జనగామ నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి పరిస్థితులు అనుకూలించడం లేదా..? సొంత పార్టీలోనే వేరు కుంపట్లు, గ్రూపు రాజకీయాలతో అంతా చెడిపోయేలా ఉందా..? నమ్మినోళ్లేలోనే పెద్ద సంఖ్యలో కోవర్టులున్నారా..? జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేవ్, ప్రచార దూకుడుకు అనుగుణంగా పల్లా ప్రణాళికల్లో వైఫల్యం చెందుతున్నా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి. ఎమ్మెల్యే కావాలనే ఎన్నో ఆశలతో జనగామ టికెట్‌ను ఏరి, కోరి కొట్లాడి మరీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయి రాజకీయంలో మాత్రం తేలిపోతున్నట్లుగా తెలుస్తోంది. జనగామ బీఆర్ ఎస్‌లో ముత్తిరెడ్డి, పల్లా వర్గీయులుగా వర్ధిల్లుతున్న పార్టీలో సమన్వయలేమి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ పరిణామాలు ప్రచార నిర్వహణపై ప్రభావం చూపుతోందని, క్షేత్రస్థాయిలోని పార్టీ క్యాడర్‌ను ముందుకు నడిపించడంలోనూ వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని సరి చేసుకోకుంటే మాత్రం పల్లాకు చేదు ఫలితం దక్కక మానదని హెచ్చరింపు సూచనలు చేస్తుండటం గమనార్హం.
అంతర్గత కుమ్ములాటలు..!
ముత్తిరెడ్డి, పల్లా వర్గీల మధ్య నేటికి సయోధ్య కుదరకపోవడంతో పార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తోందని సమాచారం. ఇరు వర్గాల నమ్మిన బంట్లు ఇద్దరి వ్యక్తుల మధ్య మూడు రోజుల క్రితం బచ్చన్నపేట ఫంక్షన్ హాల్లో గొడవ కూడా జరిగినట్లు సమాచారం. ఇటీవల పల్లా కొమురవెల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక యువకులు పల్లాకు అడ్డుపడి మీరు ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశాడు. అలాగే దూల్మిట్టలో కూడా పల్లాకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పజెప్పకుండా, తన వెంట ఉండే నాన్ లోకల్ వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వడంతో స్థానిక నాయకత్వం పెదవి విరుస్తోంది. ముత్తిరెడ్డి, పోచంపల్లి అనుచరులను పల్లా వర్గం, అనుచరులు పూర్తిగా అప్రాధాన్యం చేసేశారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ముత్తిరెడ్డి, పోచంపల్లి అనుచరులు ప్రస్తుతం జనగామ బీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలకు, ప్రచారంలో నామ్ కే వాస్తే అన్నట్లుగా కొనసాగుతున్నారన్న అభిప్రాయం ఉంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిస్థితులను గమనించి సరిదిద్దుకోకపోతే..పెద్ద ఎత్తున మూల్యం చెల్లించక తప్పదంటూ సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.