Collector Adwait Kumar Singh: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఇందిరా మహిళా శక్తి పథకాన్ని వినియోగించుకొని

Update: 2024-08-28 14:50 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ : ఇందిరా మహిళా శక్తి పథకాన్ని వినియోగించుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ, సెర్ప్ అధికారులతో మహిళా శక్తి కార్యక్రమం అమలుపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిరా మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేయాలని సూచించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

మహిళలు వ్యాపారం ప్రారంభించే ముందు తమ వద్ద ఉత్పత్తి అయ్యే వస్తువుల మార్కెటింగ్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యాపార రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. డిమాండ్ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో వివిధ మండలాల్లో ఏర్పాటు చేసే మహిళా క్యాంటీన్ లను ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. ప్రజా రవాణా ఉన్నటువంటి స్థలాలలో, రద్దీ గల స్థలాలలో మహిళా క్యాంటీన్ ఏర్పాట్లు చేసేందుకు చొరవ తీసుకుంటే బాగుంటుందని, అదే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసిన మహిళా క్యాoటీన్ లను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పౌల్ట్రీ ఫారం, పాడి పశువుల యూనిట్లు, కోళ్ల ఫారాలు, మిల్క్ పార్లర్లు, చేపల విక్రయ కేంద్రాలు,మైక్రో ఎంటర్ప్రైజెస్, స్టిచ్చింగ్ సెంటర్, మీసేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కష్టం హైరింగ్ సెంటర్ వంటి 13 యూనిట్లను స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకొనుటకు ఈ సెక్టార్లలో జీవనోపాధి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డి.ఆర్.డి.ఏ జయశ్రీ, డి.పి.ఎం లు నళిని,శ్రీనివాసరావు మెప్మా అధికారి విజయ, ఈ.డి.యం ప్రశాంత్ పాల్గొన్నారు.


Similar News