యార్డుల వినియోగంపై కరువైన చిత్తశుద్ధి..నిధులు వృథా
గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ
దిశ,నల్లబెల్లి: గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు ప్రభుత్వం డంపింగ్ యార్డులు నిర్మించింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన యార్డులు అలంకారప్రాయంగా మారాయి. వీటి వినియోగంపై అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేకపోవడం తో మూలనపడ్డాయి. నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు రూ. 2.30 లక్షల తో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్మించింది. నిర్మించిన నాటి నుంచి నేటి వరకు అలంకారప్రాయంగానే ఉంది.
కానరాని చర్యలు..
డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. కానీ ఎక్కడా ఆ విధంగా చర్యలు కానరావడం లేదు. పల్లెల్లో సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్ను వేరు చేసి అది విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చడం, తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు విక్రయించి ఆదాయాన్ని పొందడం మరో ఉద్దేశం. కానీ అలాంటివేవీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. కనీసం సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించకుండా మళ్లీ గ్రామ శివారు, బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం విమర్శలకు తావిస్తోంది.
పర్యవేక్షణ లేకనే..
గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో డంపింగ్ యార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ద్వారా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట మాత్రమే తడి పొడి చెత్తను నామ మాత్రం సేకరిస్తున్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తను సేకరించడం లేదు. దీంతో ఆశయం నెరవేరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ గ్రామంలో పూర్తిస్థాయిలో తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ తరలించినట్టు తప్పుడు రికార్డులు సృష్టించి ట్రాక్టర్ నిర్వహణ బిల్లును తీసుకుంటూ నిధుల దుర్వినియోగానికి పంచాయతీ కార్యదర్శి పాల్పడుతున్నరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలో పూర్తిస్థాయిలో తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి తడి పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీ, సీసాలు, ప్లాస్టిక్, ఐరన్ వస్తువులను వేరు చేసి విక్రయిస్తూ గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరెలా చూడాలని, ట్రాక్టర్ నిర్వహణ పేరుతో నిధులు దుర్విని వారికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి పలువురు కోరుతున్నారు.
పొలాల్లో పనులు చేయలేకపోతున్నాం : రైతు మైలగాని శీను
డంపింగ్ యార్డ్ నిర్మించిన తర్వాత ఒక్కరోజు కూడా నిర్వహణ సరిగా చేయకపోవడంతో దుర్గంధం డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న రైతులు దుర్గంధంతో పొలాల్లో పనులు చేయలేకపోతున్నాం. అధికారులు స్పందించి తడి పొడి చెత్తను వేరు చేసి దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టాలి.
ఊర్లోని అన్ని వాడల్లో చెత్త సేకరణ చేపట్టారు : మేడిపల్లి రాజు గ్రామస్తుడు
ఊర్లోని అన్ని వాళ్లకు చెత్త ట్రాక్టర్ తిప్పుతూ సేకరణ చేపట్టాలి. సేకరించిన చెత్తను తడి పొడి చెత్త వేరు చేసి అందులోని ఇనుప సామాగ్రి ప్లాస్టిక్ సామాన్లను అమ్ముతూ గ్రామపంచాయతీ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.