‘లిక్కర్ స్కామ్‌లో కవిత ఉందని ముందు తెలియదు’
లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఉందని ముందు ఎవరికీ తెలియదని, ఢిల్లీలోని ఆప్ సర్కార్ ఈ స్కామ్‌లో ఉందని అంతా అనుకున్నారని, కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఉందని ముందు ఎవరికీ తెలియదని, ఢిల్లీలోని ఆప్ సర్కార్ ఈ స్కామ్‌లో ఉందని అంతా అనుకున్నారని, కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం వెనుక మాత్రమే కల్వకుంట్ల కుటుంబం ఉందని అంతా అనుకున్నారని, కానీ ఆ కుటుంబం మద్యం వ్యాపారం చేస్తోందని ఎవరికీ ముందే తెలియదని అన్నారు. తప్పు చేసి దొరికిపోయి కేంద్రంపై నిందలు మోపుతున్నారని, స్కామ్ చేసి దొరికిపోతే అది ఈడీ, సీబీఐ తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
తప్పుచేస్తే ఎవరినీ విడిచిపెట్టొద్దనే లక్ష్యంగా భారత ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వీరిని ఇరికించడమే తమపని కాదని, తమకు దేశాన్ని అభివృద్ధి చేయాలనే చాలా పనులు ఉన్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కవిత ఆరోపిస్తోందని, ఆ విషయంపై ఆమె సుప్రీంకోర్టులో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీయేతర ప్రభుత్వం ఉంది కాబట్టే లొంగదీసుకోవాలని చూస్తున్నారని కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని, తాము అలాంటివి చేయబోమని, తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్‌ను బొంద పెడతారని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ స్టీరింగ్, ఎక్స్ లేటర్ ఎంఐఎం చేతిలో ఉన్నాయని, అందుకే లిక్కర్ కేసు, లీకేజీ అంశంపై ఆ పార్టీ నేతలు స్పందించడం లేదని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ చేసి.. ఏదో స్వాతంత్ర్య పోరాటం చేసినట్లు బీఆర్ఎస్ నేతలంతా వచ్చి ఢిల్లీలో మకాం వేయడంపై ఆయన ధ్వజమెత్తారు.
మార్పు బీజేపీతోనే సాధ్యమని ఉపాధ్యాయ సమాజం నమ్మిందని, అందుకే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డిని గెలిపించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే దూకుడుతో ముందుకు వెళ్తామన్నారు. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్క్ తెలంగాణకు కేటాయించిందని, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ ఫార్ములతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ పథకం కింద రూ.4445 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఒక్కో టెక్స్ టైల్ పార్కుకు కనీసం 1000 ఎకరాల స్థలం కావాల్సి ఉందన్నారు. కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రీసెర్చ్ సెంటర్, ఏర్పాటుతో పాటు స్టార్టప్‌లకు కూడా ఇందులో అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. లక్ష మందికి నేరుగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేయడంపై పలు దేశాలతో ఒప్పందం కుదిరిందని, పలు దేశాలతో త్వరలో ఒప్పందం కుదరనుందని పేర్రకొన్నారు. రాజకీయలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సహకారం అందించాలని ఆయన సూచించారు. మేకిన్ ఇండియా అంటే.. రాష్ట్ర ప్రభుత్వం జోకిన్ ఇండియా అని చిన్న చూపు చూస్తోందని కిషన్ రెడ్డి చురకలంటించారు. ఇలా అవహేళన చేయకుండా ప్రోత్సహించాలన్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ రైలుపై కేసీఆర్ విమర్శలు, పరిహాసాలు చేశారని మండిపడ్డారు. ఇది ప్రధాని మోడీని విమర్శించినట్లు కాదని, రైలు తయారీకి కష్టపడిన కార్మికులను అవమానించినట్లని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు దమ్ముంటే దీన్ని చాలెంజ్‌గా తీసుకుని పోటీగా పనిచేసి అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తే బాగుంటుందని చురకలంటించారు. మంచి జరిగితే తండ్రీకొడుకులు తమ ఖాతాలో వేసుకుని, చెడు జరిగితే బీజేపీ కుట్ర అని నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. లీకేజీ విషయంలో అందరూ ప్రశ్నిస్తుంటే తమకు సంబంధం లేదని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణకు ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించక, పట్టించుకోక నిలిచిపోయాయన్నారు. మెగా టెక్స్ టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి వ్యక్తంచేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లులకు వ్యతిరేకం కాదని, ఈ అంశానికి ముందు నుంచే తాము కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు. మహిళా బిల్లుల అంశంపై దీక్ష చేస్తున్న బీఆర్ఎస్.. ఈసారి ఎన్నికల్లో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇస్తుందో చూద్దామని పేర్కొన్నారు. మహిళా బిల్లులపై కవిత ఢిల్లీలో దీక్ష చేయడం కాకుండా ప్రగతి భవన్, ఫాంహౌజ్, తెలంగాణ భవన్ వద్ద చేస్తే బాగుండేదని సెటైర్లు వేశారు.
ఇవి కూడా చదవండి :