కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా కాంగ్రెస్ తీరు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ కమిటీల పేరుతో కాలయాపన చేసిందని, ఉష మెహ్రా కమిటీ రిపోర్ట్‌ను కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిందని, అప్పటి ప్రధాని కనీసం ఆ నివేదికలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ కమిటీల పేరుతో కాలయాపన చేసిందని, ఉష మెహ్రా కమిటీ రిపోర్ట్‌ను కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిందని, అప్పటి ప్రధాని కనీసం ఆ నివేదికలు చేదవలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను అర్ధం చేసుకుని కమిట్ మెంట్‌తో ప్రధాని మోడీ మాట్లాడారని తెలిపారు. 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ఎన్నో కమిటీలు వేశారని, అనేక చర్చలు జరగాయని, కానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై సానుకూలంగా స్పందించిందని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులోనూ చెప్పామని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 14 వరకు అభ్యంతరాలు చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసులు కూడా పంపించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు మోడీ కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. అయితే కమిటీ వేస్తానని చెప్పింది మాత్రం వర్గీకరణ చేయాలా? వద్దా? అని కాదని, వేగవంతంగా అమలు చేసేందుకేనని ఆయన స్పష్టంచేశారు. కానీ కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న తీరులో విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదని, మోడీ సర్కార్ అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటుచేసి నేతలను ఢిల్లీకి తీసుకువెళ్తానని సీఎం కేసీఆర్ అన్నారని, కానీ ఇప్పటి వరకు తీసుకువెళ్లింది లేదని మండిపడ్డారు. ఓట్ల కోసం, రాజకీయాల కోసం వర్గీకరణ చేయడం లేదని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం కోసం కమిట్ మెంట్‌తో పనిచేస్తున్నట్లు స్పష్టంచేశారు. బీజేపీ ఏదైనా సరే చెప్పదని, చేసి చూపిస్తుందని ఆయన తెలిపారు.