హైదరాబాద్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
మావోయిస్టు దంపతులను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు దంపతులను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేసిన వీరు గతకొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గడ్చిరోలి జిల్లా బస్వాపూర్‌కు చెందిన మధుకర్(టూగే), బీజాపూర్ జిల్లా బండగూడెంకు చెందిన శ్యామలగా గుర్తించారు. 2002 నుంచి వీరు పీపుల్స్ వార్‌లో దళ కమాండర్‌గా పనిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
గత 15 ఏళ్ల క్రితం దండకారణ్యం వదిలి జనాల్లోకి వచ్చారని, హైదరాబాద్‌లో స్థిరపడి మధుకర్ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా, శ్యామల హౌజ్ కీపింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. మధుకర్‌పై రూ.8 లక్షల రివార్డుతో పాటు 9 హత్యా, 2 దోపిడీ, 4 లూటీ, 8 ఎదురుకాల్పులు, ఒక హత్యాయత్నం కేసులు ఉన్నట్లు గుర్తించారు. శ్యామలపై రూ.2 లక్షల రివార్డుతో పాటు 5 ఎదురుకాల్పుల కేసులు, ఒక దోపిడీ, ఒక లూటీ కేసు ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, వీరు అడవిని ఎందుకు వదిలేశారన్నది మిస్టరీగా మారింది.