‘రైతుల ప్రాణాలు తీసి దీక్షలా..?’ ఈటలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2024-10-01 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌ (Etala rajender)పై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala nageswara) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తోందని, 6 నెలల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు హామీలను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుంటే బీజేపీ (BJP)కి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డితో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ఇందిరాపార్క్ (Indira Park) వద్ద 24 గంటల దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు (మంగళవారం) ఆయన దీక్ష విరమించే నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విమర్శలకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడడం వింతగా ఉందని, అసలు రైతుల కోసం దీక్ష చేసే అర్హత ఆ పార్టీకి లేదని ఫైర్ అయ్యారు. నల్ల చట్టాలు తెచ్చి రైతు చావులకు కారణమైన పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీ నేత అయిన ఈటల రైతుల కోసం దీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చే సమయంలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని మాటిచ్చామని, 6 నెలల్లోనే రూ.18 వేల కోట్లు చేశామని అన్నారు. అసలు దేశంలో ఎక్కడా రైతు రుణ మాఫీ చేయని బీజేపీ మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసిన తుమ్మల.. ఈటల ధర్నా చేయాల్సింది ఇందిరాపార్క్‌లో కాదని, ఢిల్లీలో అని సలహా ఇచ్చారు.


Similar News