టీ టీడీపీ చీఫ్ పదవి బీసీకా..రెడ్డికా? కుల సమీకరణపై అధినేత ఆరా!
టీ టీడీపీ అధ్యక్ష పదవిపై ఆసక్తి నెలకొంది. ఏ సామాజికవర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: టీ టీడీపీ అధ్యక్ష పదవిపై ఆసక్తి నెలకొంది. ఏ సామాజికవర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న తరుణంలో ఆ ఈక్వేషన్‌ను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ నేతలతో మూడు రోజుల్లో చంద్రబాబు భేటీ కానున్న తరుణంలో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఓసీలకు పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో మళ్లీ బీసీకి ఇస్తారా..లేకపోతే రెడ్డికి ఇస్తారా? అనే చర్చ జోరుగా జరుగుతోంది.
తెలంగాణలో పార్టీపై బాబు ఫోకస్
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర సారథి ఎంపికపై మూడురోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య లీడర్లతో ఈనెల 7న ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్ష పదవిపై స్పష్టత వస్తుందని నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఏ సామాజికవర్గానికి ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. మళ్లీ తెలంగాణలో పార్టీపై ఫోకస్ పెడతానని, బలోపేతం చేస్తానని, పుర్వ వైభవం తీసుకొస్తానని బాబు ప్రకటించారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతానని చెప్పడంతో పాటు నేతలతో భేటీ అవుతుండటంతో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సారి ఓసీకి చాన్స్!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీపై చంద్రబాబు ఫోకస్ పెట్టి రాష్ట్ర పార్టీ బాధ్యతలను తెలంగాణ నేతలకు అప్పగించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎల్.రమణ, కాసాని జ్ఞానేశ్వర్‌కు అప్పగించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులుకు ఒకసారి పార్టీ బాధ్యతలను అప్పగించారు. పదేండ్లలో ముగ్గురిని బడుగు, బలహీన వర్గాల వారికే అవకాశం కల్పించారు. ఈ సారి ఓసీకి అవకాశం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత, పార్టీ ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, కాట్రగడ్డ ప్రసూనతో పాటు మరికొంత మంది లీడర్లు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ పరిస్థితిపై ఆరా
రాష్ట్రంలో కుల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర జనాభాలో అత్యధికులు ఉన్న బీసీ సామాజిక వర్గానికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఆ పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు అదే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏపీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణలోనూ అదే ఫార్ములా ఉండొచ్చని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్‌గౌడ్, బక్కని నర్సింహులు పేర్లు సైతం తెరమీదకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాలపై, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న గడ్డుపరిస్థితికి గల కారణాలను సైతం లీడర్లతో బాబు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
‘లోకల్’ ఎలక్షన్స్‌లో సత్తా చాటేలా ప్లాన్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాష్ర్ట అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది. కేడర్‌కు దిశానిర్దేశం, నేతలను కోఆర్డినేట్ చేయాలన్నా సమర్థవంతమైన నాయకుడితోనే సాధ్యం. అందుకే ఆచూతూచీ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తేనే స్థానిక సంస్థల్లో సైతం సత్తాచాటే అవకాశం ఉంది. ఇతర పార్టీలను సైతం ఢిపెన్స్‌లోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే గతంలో పార్టీలో పనిచేసి బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వారికే పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని లీకులు సైతం వచ్చాయి. అయినప్పటికీ ఇప్పటివరకు చేరికలు కానీ, సంప్రదింపులు కానీ జరగలేదు. ఎవరు చేరతారనే క్లారిటీ కూడా రాలేదు. పార్టీ నేతలు సైతం ఇతరపార్టీలో పనిచేస్తున్న వారిని సొంతగూటికి ఆహ్వానిస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారికి ఇస్తారా? ఇతర పార్టీల్లో నుంచి వచ్చేవారికి అధ్యక్ష పదవి ఇస్తారా? అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.