ఆ పోస్టులకే ఎడిట్ ఆప్షన్స్.. టీఎస్సీపీఎస్సీ ప్రకటన
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. మే 17 వ తేదీ నుంచి నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లల్లో ఖాళీగా ఉన్న 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టులకు గతేడాది డిసెంబర్ నెలలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 6 నుంచి 27వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరించింది. అయితే పలువురు అభ్యర్థుల దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం కారణంగా.. వారి విజ్ఞప్తుల మేరకు ఎడిట్‌కు అధికారులు అవకాశం కల్పించారు.
ఎడిట్‌కు వన్ టైం చాన్స్!
దరఖాస్తు ఎడిట్ ప్రక్రియ ఒక సారి మాత్రమే ఉంటుందని, కాబట్టి ఎడిట్ చేసేటప్పుడు తప్పులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థి ‘అన్ ఎంప్లాయ్ నుంచి ఉద్యోగి’ గా మార్చుకునే మిస్టేక్ ఉంటే వారు రూ. 120 రుసుము చెల్లించాలని తెలిపింది. అభ్యర్థులు తమ బయో-డేటాలో పేరు, జెండర్, ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ మొదలైనవి దిద్దుబాటు చేసినట్లయితే, వారు సంబంధిత సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.