తగ్గేదే లేదు! మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన టీఎస్ ఆర్టీసీ

నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి టీఎస్ ఆర్టీసీ, సంస్థ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

Update: 2024-05-11 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి టీఎస్ ఆర్టీసీ, సంస్థ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఆయన ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే సంస్థ వదిలేస్తోందని, అద్దె బకాయిల విషయంలో లీజ్‌ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోందన్నారు. బకాయిలు చెల్లించాలని గత 5 ఏళ్లుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసిందన్నారు.

తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదు. జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తి అర్ధరహితమని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే క్రమం తప్పకుండా జీఎస్టీని కేంద్రానికి సంస్థ చెల్లిస్తోందని, బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదన్నారు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోందని, ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.

కాగా, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ బస్‌ స్టేషన్‌ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టీఎస్‌ఆర్టీసీ అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద2013న ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగింది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్‌ఓవర్‌ చేసుకుని.. షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.

ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 9వ తేదిన నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు షాపింగ్‌ మాల్‌ కు వెళ్లారు. ఆ మాల్‌ లో థర్డ్‌ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్‌ లో అనౌన్స్‌ చేయడం జరిగింది.. అని పేర్కొన్నారు.

Tags:    

Similar News