TS Assembly: బీఆర్ఎస్ చేసిన పాపాలు చెప్పాలంటే రోజులు సరిపోవు: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ చేసిన పాపాలు చెప్పాలంటే రోజులు సరిపోవని, పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-07-29 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చేసిన పాపాలు చెప్పాలంటే రోజులు సరిపోవని, పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చేపట్టిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి ముఖ్యమైన వపర్ సెక్టార్‌ బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైందని అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. అందులో వాడిన టర్బైన్స్, జనరేటర్, బాయిలర్స్ పాతవి వాడారని సభ దృష్టికి తీసుకొచ్చారు. 15 ఏళ్ల కింద ఇండియా బుల్స్ కంపెనీ కోసం తయారు చేసిన పరికరాలను కంపెనీ మూతపడటంతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు వాడారని తెలిపారు.

ఈ క్రమంలోనే పవర్ ప్లాంట్‌లో ఎప్పుడో ఏదో ఒక యూనిట్ షట్‌డౌన్ అవుతోందని స్పష్టం చేశారు. ఎంత బాధ్యతరహితంగా ఉంటే కాలం చెల్లిన పరికరాలను పవర్ ప్లాంట్‌లో వాడుతారంటూ రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని అన్నారు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఎప్పుడో పనులు ప్రారంభించినా పవర్ ప్లాంట్ ఇంకా వినియోగంలోకి.. రాలేదని అన్నారు. గత ప్రభుత్వ కాలయాపనతో నిర్మాణ ఖర్చు ఆమాంతం పెరిగిందని అన్నారు. ఆ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ కూడా సరిగ్గా నిర్వహించలేదని మండిపడ్డారు. త్వరలోనే విద్యుత్ రంగంపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News