మునుగోడులో టీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ఆ కీలక నేత వర్గీయులపై ఫోకస్!
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రతి రోజూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు నేతల పర్యటనలు రోజూ జరుగుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రతి రోజూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు నేతల పర్యటనలు రోజూ జరుగుతున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మండలానికి ఓ పెద్ద నాయకుడిని ఇన్‌చార్జిని నియమించడం, పీసీసీ రేవంత్ రెడ్డి కూడా అక్కడే మకాం వేస్తానని ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దాంతో ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార పక్షం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే వామపక్షాల మద్దతును కూడగట్టింది. అయితే క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ఓట్లు రాలుతాయో అంతుచిక్కడం లేదు. ఇప్పటికైతే సీపీఐ, సీపీఎం మద్దతుపై కార్యకర్తల్లో నిరాశే మిగిలింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలపైనే ఫోకస్ పెట్టింది. జంప్ జిలానీలను ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నది. గ్రామాల వారీగా ఎవరెవరిని లాక్కుంటే ప్రయోజనం ఎంత అనేది క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయిస్తున్నది. అది కూడా పొరుగు జిల్లాకు చెందిన వారితో కావడం విశేషం. గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా టీఆర్ఎస్ ఆకర్ష్ పథకాన్ని అమలు చేయనుంది. 18 అంశాలతో సోమవారం నుంచి స్టడీ మొదలైంది. ఏడు గ్రామాలకొకరు వంతున నియమించింది. గ్రామాల్లో తక్షణం ఏమేం పనులు చేయాలి? అందులో ఆర్థిక భారం లేని వాటిపై వెంటనే అమలు చేయనుంది. బడ్జెట్‌తో కూడిన పనులకు కూడా గట్టి హామీలతో ఆకట్టుకునేందుకు వ్యూహరచన చేస్తున్నది. ఇప్పటికే ఈ మేరకు యంత్రాంగం నిమగ్నమైంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా ఎవరనేది ప్రచారంలోకి వచ్చేసింది. అయితే, టికెట్ ఆశించి భంగపడిన వర్గాలు ఏం చేస్తున్నాయో ఓ కన్నేసింది. వారి అనుచర వర్గం ఏం చేస్తున్నది? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోసం పని చేస్తారా? చేయరా? అసలేం జరుగుతుందన్న విషయాలపై గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకునేందుకు రంగం సిద్ధమైంది. గ్రూపు రాజకీయాలతో ఎంత ప్రభావం చూపిస్తుంది? దాన్ని నియంత్రించేందుకు ఏం చేస్తే లాభం? అన్న విషయాలపై కసరత్తు చేస్తున్నది. ఓ వైపు సొంత పార్టీ నేతలపై ఎంక్వయిరీ చేస్తూనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తల గురించి ఆరా తీస్తుండడం గమనార్హం.
బీజేపీకి వెళ్లని వారెవరు?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న నాయకుల వివరాలను సీఎం కేసీఆర్ తెప్పించుకుంటున్నారు. వాళ్లు రాజగోపాల్ రెడ్డిని విబేధించిన అంశాలేమిటో, వాటిపై స్టడీ చేయిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన తర్వాత వ్యతిరేకిస్తున్న వారెవరెన్న విషయాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రధానంగా డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగే చలమల్ల కృష్ణారెడ్డి అభ్యర్థిగా ప్రకటిస్తారనుకుంటే స్రవంతి పేరు ఖరారు కావడంతో నిరుత్సాహపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను బుట్టలో వేసుకునే పనిలో పడినట్లు సమాచారం. ఎవరెవరి బలాలు, బలహీనతలను.. ఆసరాగా చేసుకొని పావులు కదిపేందుకు సిద్ధమైంది. ఎవరెరిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎంత లాభం? అని లెక్కలు వేయిస్తున్నారు.
వ్యతిరేకత ఎందుకు?
కొన్ని గ్రామాల్లో పార్టీ, పార్టీ నేతలపై తీవ్రమైన వ్యతిరేకతకు కారణాలేమిటి? అసలేం జరిగింది? ప్రధానంగా సాగు నీటి ప్రాజెక్టులు, భూ సేకరణ చేసిన ప్రాంతాల్లో జనంలో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి కారణాలు ఏమిటి? వాళ్లు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? వీటిపై స్టడీ చేసేందుకు నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ఓ వైపు జంప్ జిలానీలు, మరో వైపు ప్రజాగ్రహాన్ని నియంత్రించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై టీఆర్ఎస్ అధినేత స్వయంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే ఈ స్టడీ పూర్తి కానుందని తెలిసింది. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: అసెంబ్లీ సాక్షిగా.. RTC అమ్మకంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు