పీఆర్సీ కమిటీతో ట్రెసా ప్రతినిధుల బృందం భేటీ
పెరిగిన ధరలకనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పెరిగిన ధరలకనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది. గురువారం వేతన సవరణ కమిటీ చైర్మన్ శివశంకర్‌తో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ నాయకత్వంలో బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల పే స్కేల్స్, ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయని, అత్యధిక విధులతో ఉన్న జాబ్ చార్ట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధిక పని ఒత్తిడితో పాటు అత్యవసర సేవల్లో నిరంతరం పని చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు స్కేల్స్ మంజూరులో జరుగుతున్న వ్యత్యాసాన్ని, ఉద్యోగులు నష్టపోతున్న విధానాన్ని వివరించారు. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సవరించాలని ట్రెసా ప్రతినిధులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రూప్ -2 ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఎంపికైన డిప్యూటీ తహశీల్దారుతో పోలిస్తే నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఎంపికైన ఏఎస్ఓ తదుపరి పదోన్నతిలో తహశీల్దారుకు సచివాలయ సెక్షన్ అధికారి కంటే తక్కువ స్కేల్ ఉన్న క్రమంలో దాన్ని సవరించాలన్నారు. నాయబ్ తహశీల్దార్లకు పంచాయతీ రాజ్ శాఖలో ఎంపీఓ, సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్ కు సంబంధించిన సమాన స్కేల్ మంజూరు చేయాలన్నారు. సీనియర్ అసిస్టెంట్లు/మండల గిర్దావర్లకు సహకార శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్ స్థాయికి సమానమైన పే స్కేల్ ఇవ్వాలి. క్షేత్ర స్థాయిలో పని చేసే మండల గిర్దావర్లతో పాటు మండల సర్వేయర్లకు ప్రత్యేక అలవెన్స్ లతో పాటు మెరుగైన స్కేల్స్ నిర్దారించాలన్నారు.
జూనియర్ అసిస్టెంట్లకు జూనియర్ ఇన్స్పెక్టర్ స్థాయికి, ఆఫీస్ సభార్డినేట్లకు మెరుగైన పేస్కేల్ వర్తింపచేయాలన్నారు. డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ స్థాయికి సమానంగా స్కేల్స్ నిర్దారించాలి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు తదుపరి పదోన్నతి కొరకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా స్కేల్ నిర్దారించి పోలీస్ శాఖలో నాన్ కేడర్ ఎస్పీల మాదిరిగా, నాన్ కేడర్ కలెక్టర్లుగా నియమించే అవకాశం కల్పించాలని కోరారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలన్నారు. భేటీలో ట్రెసా ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.