నూతన విద్యా విధానం అమలు చేయవద్దు.. టీపీటీఎఫ్ అధ్యక్షుడు అశోక్ కుమార్
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే నూతన విద్యా విధానం అమలు చేయరాదని టీపీటీఎఫ్ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే నూతన విద్యా విధానం అమలు చేయరాదని టీపీటీఎఫ్ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి లక్స్మయ్య భవన్ ఎదుట టీపీటీఎఫ్ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిలక్ష్యం చేస్తూ విద్యారంగానికి సరిపడా బడ్జెట్ ఇవ్వడం లేదని, విద్యారంగంలో ఉన్న ఖాళీలను నింపకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ బడులలో చదువుతున్న 21 లక్షల మంది విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నష్టపోతున్నారని అన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన నూతన విద్యా విధానం పేదలకు విద్యను దూరం చేసేదిగా ప్రైవేటీకరణను బలోపేతం చేసేదిగా ఉందన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసిందని, విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా నుంచి తొలగించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే నడిపించే విధంగానూ రాష్ట్ర ప్రభుత్వ స్వతంత్రతను, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా ఉందని దానిని రాష్ట్రంలో అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యలో కార్య కారణ సంబంధాన్ని తెలియచేసే పాఠ్యాంశాలను తొలగించి, శాస్త్రీయత కు నిలబడని మూఢ నమ్మకాలను ప్రోత్సహించే పాఠ్యాంశాలను ప్రవేశపెడుతుందనీ దీనిని టీపీటీఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకుడు ఎం.ప్రకాష్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.