ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే (Dubbaka BRS MLA) కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం గా మారాయి. ఈ నెల 27 వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ (BRS founding meeting) నేపథ్యంలో సోమవారం తొగుట మండలం లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress party)పై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారి, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చుకు డబ్బులు కూడా ఇస్తామంటున్నారని, రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) స్పందించారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో జరుగుతున్న సీఎల్పీ సమావేశం (CLP meeting)లో పాల్గోనేందకు అక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్ర కోణం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు.