Chandrayaan-3: నేడు నింగిలోకి చంద్రయాన్ - 3.. ల్యాండింగ్ ఏ ధ్రువంపై అంటే?
మరి కొద్ది గంటల్లో చంద్రయాన్ -3ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: మరి కొద్ది గంటల్లో చంద్రయాన్ -3ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో గురువారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమైన 24 గంటల కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత ఎల్ వీఎం -3 ఎం4 రాకెట్ 2.35గంటలకు నింగిలోకి రాకెట్ ద్వారా దూసుకెళ్లనుంది. చంద్రయాన్-2 లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండింగ్ కాగా ఆ అనుభవాల దృష్టిలో ఉంచుకుని ఈ సారి కీలక మార్పులు చేపట్టారు.
ప్రయోగ కేంద్రం నుంచి బయలు దేరిన 217 సెకన్ల తర్వాత భూమికి 115 కిలో మీటర్ల ఎత్తున శాటిలైట్ తో కూడిన పేలోడ్ రాకెట్ నుంచి విడిపోనుంది. దాదాపు ఆరు వారాలు ప్రయాణించి 3.86లక్షల కిలోమీటర్ల దూరంలోని చంద్రుడిని చేరుకుంటుంది. అగస్ట్ 23 లేదా 24 ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ల్యాండింగ్ కోసం ఇస్రో ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది. దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ -3 అనుకున్నట్లుగా ల్యాండ్ అయితే ఈ ఘటన సాధించిన తొలి దేశంగా భారత్ నిలవనుంది.