తెలంగాణ పోరాటం ఇంకా మిగిలే ఉంది.. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
తెలంగాణ పోరాటం ఇంకా మిగిలే ఉందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోరాటం ఇంకా ముగియలేదు.. మన తోవ అయిపోలేదు.. ఇంకా ప్రయాణం ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని, ప్రజాస్వామిక తెలంగాణ కోసం అందరూ సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటాన్ని అందరూ మర్చిపోయారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటం ప్రపంచంలోనే అత్యంత విషిష్టవంతమైన పోరాటమని తెలిపారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతియుతంగా ఇంత సుదీర్ఘకాలం చేసిన పోరాటం మరొకటి లేదని ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక డిమాండ్ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన పోరాటం ప్రపంచంలోనే ఎక్కడ లేదన్నారు. టిబేట్, కోరియా, ఐర్లాండ్‌లో కొంత మంది చనిపోతే.. ఆ దేశాలు అతలాకుతలం అయి ప్రజలందరూ రోడ్లమీదకు వచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో 650 మంది బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు.
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను, ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయిందని ఆరోపించారు. వారి స్వార్థం, వారి ఆస్తుల పెంపుదల, వారి ప్రయోజనాలే తప్ప.. ప్రజల ప్రయోజనాలు వారికి పట్టలేని, అటువంటిపాలన ఇవ్వాళ తెలంగాణలో ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలు మన చరిత్ర గుర్తు చేసుకోవడం ద్వారా నేడు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు యాదికి వస్తాయని తెలిపారు. నేడు మన కర్తవ్యం.. గతంలో మా తెలంగాణ మాకు కావాలి అని పోట్లాడాము.. నేడు కూడా మనం అదే నినాదం ఇవ్వాల్సి వస్తున్నదని అన్నారు.
ఈ పాలకుల చెర నుంచి తెలంగాణను విడిపించుకుందామని పిలుపునిచ్చారు. అప్పుడు ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నామని, ఇవ్వాల తెలంగాణ పాలకుల ఆదిపత్యం దోపిడీ, నిరంకుశత్వం నుంచి తెలంగాణ విడిపించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. తెలంగాణను విడిపించుకోవడం ఇవ్వాల మన అందరి కర్తవ్యమన్నారు. ఆ నాడు ఎలా సంఘటితం అయ్యామో ఇవ్వాల ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.
Also Read..
ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలే: కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు