ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మూడు పార్టీలు ఛేంజ్.. చివరకు..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దిశ, కాటారం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారతాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. నేటి రాజకీయాల్లో లీడర్లు పూటకో పార్టీ మారడంతో ఆ నాయకులను నమ్ముకున్న కేడర్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. స్టేట్ పాలిటిక్స్‌తో పాటు గ్రామీణ స్థాయిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాలలో కొందరు రోజుకు రెండు మూడు పార్టీలు మారుతుండగా, కొందరు మండల స్థాయి నాయకులు గంటల వ్యవధిలో పార్టీ మారుతున్నారు.
మంథని నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణరెడ్డి ఇదే కోవకు చెందారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా సర్పంచి నుండి జడ్పీటీసీ, నామినేటెడ్ పోస్టుల వరకు కాంగ్రెస్ పార్టీకి మండల స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. కొన్నేళ్ల క్రితం అనుహ్య రీతిలో చల్లా నారాయణరెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. శాసనసభకు జరగనున్న ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కొన్ని నెలలు గా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ పుట్టినరోజున ముఖ్యమంత్రి క్షేమాన్ని కోరుతూ కాలేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో చల్లా నారాయణరెడ్డి యాగం నిర్వహించారు.
ఇక ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం ఇస్తే మంథని నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అప్పటి నుండి బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. చైర్మన్ చల్లా నారాయణరెడ్డి మంథని నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతూ పర్యటించారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నప్పుడు విభేదాల మూలంగా కొన్ని కార్యక్రమాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. నియోజకవర్గ ఇన్ ఛార్జి పుట్ట మధుకర్, చల్లా నారాయణరెడ్డి వర్గాల మధ్య పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. చివరకు బీఆర్‌ఎస్ టికెట్ మధుకు లభించడంతో నారాయణరెడ్డి కంగుతిన్నారు.
బీఆర్ఎస్ బీఫారంలో పంపిణీ చేసేంతవరకు వేచి చూసిన నారాయణరెడ్డి గత నెల 30వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్ ఇస్తారన్న ఒప్పందం మేరకే నారాయణరెడ్డి ఆ పార్టీలో చేరినట్లు అనుచరులు పేర్కొన్నారు. బీజేపీ సైతం చందుపట్ల సునీల్ రెడ్డిని మంథని అభ్యర్థిగా ప్రకటించడంతో నారాయణరెడ్డికి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే తాను మాత్రం ఎమ్మెల్యే పోటీలో ఉంటానని నారాయణరెడ్డి ప్రకటించారు.
ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే విషయం చెప్పకుండా బీఫారం వచ్చేంతవరకు సీక్రెట్ మెయింటెనెన్స్ చేశారు. బీజేపీకి సోమవారం చల్లా రాజీనామా చేశారు. మంగళవారం బీఎస్పీ నుండి మంథని అభ్యర్థిగా బీఎస్పీ ఏడు రాష్ట్రాల ఇన్చార్జి రాజ్యసభ సభ్యులు గౌతం రాంజీ నుండి బి ఫారం పొందారు. సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జాతీయ పార్టీ నుండి టికెట్ కోసం మూడు పార్టీలు మారినట్లు నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.