కేసీఆర్ బిక్షతో బ్రతికే వీళ్లకి విమర్శించే హక్కు లేదు.. జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి మాట్లాడేవి రోత మాటలు అని, ముఖ్యమంత్రి అయినా కూడా సంస్కారం నేర్చుకోలేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి మాట్లాడేవి రోత మాటలు అని, ముఖ్యమంత్రి అయినా కూడా సంస్కారం నేర్చుకోలేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న భువనగిరి సభలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన నాటి నుండే భాష తప్పిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి అని సోయి కూడా లేకుండా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్ని ఫ్రెస్టేషన్ లో మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ 25 కోట్లు పెట్టి పీసీసీ కొని తెచ్చుకున్నాడని అన్నారని, అలాగే రేవంత్ రెడ్డి వీరిపై హోంగార్డ్స్ ఎప్పుడు ఎస్పీలు కాలేరని ఒకరిని ఒకరు తిట్టుకున్నోళ్లు ఇవ్వాళ ఒక స్టేజీపై మాట్లాడుతుంటే బుర్రకథ చెప్పుకునే వాళ్లు నవ్వుకుంటున్నారని, వీరి మాటలు విని ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయన్నారు. జైపాల్ రెడ్డి, జానా రెడ్డిల గురించి సంస్కారం లేకుండా మాట్లాడేవాళ్లు కేసీఆర్ గురించి సంస్కారవంతంగా మాట్లాడతారని తాము అనుకోవట్లేదని తెలిపారు.
కోమటిరెడ్డి ఉద్యమకారుడని సర్టిఫికేట్ ఇస్తున్నారని, మరి మేము ఉద్యమాలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ విహరిస్తున్నారని, తమ గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలని మండిపడ్డారు. పదవుల కోసం బూట్లు తుడిచే వీళ్లకి ధర్మబిక్షం గురించి మాట్లాడే హక్కు లేదని, ఉద్యమాలు చేసిన మేమే అసలైన ధర్మబిక్షం వారసులమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ వల్లే వీళ్లు పదవులు అనుభవిస్తున్నారని, కేసీఆర్ బిక్షతో బ్రతికే వీళ్లకు కేసీఆర్ ను తమను విమర్శించే హక్కు లేదని, కేసీఆర్ కాలి గోటికి సరిపోరని దుయ్యబట్టారు. ఇక ఎత్తుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, ఉత్తమ్, భట్టి కూడా నిన్ను తమ మోకాలు ఎత్తు లేడు మన కంటే పైకి వెళ్ళాడని మాట్లాడుకుంటున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.