పేరుకే ఆ మూడు పార్టీలు వేరు.. అంతర్గంతంగా ఒక్కటే.. బీజెపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు వేర్వేరు పేర్లతో ఉన్నా, అంతర్గతంగా ఆ పార్టీల ఆలోచన ఒక్కటేనని ఆదిలాబాద్ బీజెపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు వేర్వేరు పేర్లతో ఉన్నా, అంతర్గతంగా ఆ పార్టీల ఆలోచన ఒక్కటేనని ఆదిలాబాద్ బీజెపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆయా పార్టీల కార్యాలయాలు వేర్వేరుగా ఉండొచ్చు కానీ, లోపల మాత్రం అవి ఒకే పార్టీలా నడుస్తున్నాయన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఎంఐఎం వేరు అని చెప్పారని, అదే సమయంలో ఎంఐఎం నేతలు ఎవ్వరితోనూ మైత్రి లేదన్నారని, కానీ ఈ గెలుపుతో వారి అసలు స్వరూపం బయటపడిందన్నారు.
15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే హిందువులను నామరూపాలు లేకుండా చేస్తామన్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, ప్రత్యక్షంగా కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తే.. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కు ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిందన్నారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లకు తాము రాజకీయంగా మద్దతిచ్చినా..తమకేం కాదనే రీతిలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు వ్యవహారం నడుపుతున్నాయన్నారు. కేవలం మూడే నియోజకవర్గాల్లో పరిమితమైన ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల కారణంగా ఈరోజు ఏడుగురు శాసనసభ్యులకు చేరిందన్నారు. ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అయ్యేలా బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు.
పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపై దాడులకు పాల్పడినా సిగ్గురాలేదన్నారు. ఎంఐఎం పార్టీ ఒక మత తత్వ పార్టీ అని, ఇది హిందువుల హక్కులకు, ఆచారాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఏ మతం అని అడిగి హిందువులపై దాడులు జరుపుతున్న విషాకరమైన సందర్భంలోనూ నిస్సిగ్గుగా బీఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం పార్టీకి మద్దతుగా వ్యవహరించాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు ఇక కార్యాలయాలు వేర్వేరుగా అవసరం లేదన్నారు. ఈ మూడు పార్టీలు పాతబస్తీ దారుస్సలాం కార్యాలయంలోనే కలిసిపోవచ్చునని ఎద్దేవ చేశారు. ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు హిందువులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూనే ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకుండా కోరుకున్న పార్టీ ఎంఐఎంను తెలంగాణలో బలపడేందుకు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలు అన్ని రకాలుగా సహకరిస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకులను, అమరవీరులను అవమానించిన ఎంఐఎం పార్టీకి బహిరంగంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో తెలంగాణలో ఎంఐఎం బలపడాలన్నదే కాంగ్రెస్-బీఆర్ఎస్ లక్ష్యంగా మారింది. ఎంఐఎం పార్టీతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలను ప్రజలు గమనించాలని కోరుతున్నానన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ చెంతన చేరుతుంది ఎంఐఎం పార్టీయేనన్నారు.
ఈ కుట్రల మర్మం ను ప్రజలు గమనించాలని కోరుతున్నామన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంశాలపై మౌనం వహిస్తూ, పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని తెలంగాణ ప్రజలు నామరూపాలు లేకుండా చేయకతప్పదన్నారు. దాంతో పాటు ఎంఐఎం పార్టీకి నిస్సిగ్గుగా మద్దతిచ్చిన కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తారని అన్నారు.