రేసులో ఆ నలుగురు.. కొత్త డీజీపీ ఎవరో...?

పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర డీజీపీ నియామకం జరుగనుంది.

Update: 2023-12-07 02:19 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర డీజీపీ నియామకం జరుగనుంది. ఈ క్రమంలో పోలీసు శాఖలో కొత్త బాస్ ​ఎవరన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. రేసులో ప్రస్తుతం ఇన్​ఛార్జ్​ డీజీపీగా ఉన్న రవిగుప్తాతో పాటు సీనియర్​ ఐపీఎస్​ అధికారులు జితేందర్, రాజీవ్ ​రతన్, సీ.వీ.ఆనంద్‌లు ఉన్నారు. ఈ నలుగురిలోనే ఎవరో ఒకరికి డీజీపీ పగ్గాలు దక్కుతాయని చెబుతున్న పోలీసు వర్గాలు రవిగుప్తా, రాజీవ్ ​రతన్‌లలో ఒకరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి.

ఓట్ల లెక్కింపు రోజున కాంగ్రెస్​ అధికారంలోకి రావటం ఖాయమని సంకేతాలు రాగానే అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) సంజయ్​కుమార్ ​జైన్, సీఐడీ ఛీఫ్ ​మహేశ్ ​భగవత్‌లు సీబీఐ కాలనీలోని రేవంత్​రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎలక్షన్ ​కమిషన్ ​డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్​ చేయాలని సూచించింది. మిగితా ఇద్దరికి వివరణ ఇవ్వాలని సూచిస్తూ నోటీసులు జారీ చేయాలని పేర్కొంది.

ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ ​చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్​కుమార్ ​జైన్, మహేశ్​భగవత్‌లకు నోటీసులు జారీ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఏసీబీ డీజీగా ఉన్న రవిగుప్తాను ఇన్​ఛార్జ్​ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త డీజీపీ నియామకం జరుగనుంది.

ప్రస్తుతం ఈ పోస్టు కోసం ఇన్‌ఛార్జ్ ​డీజీపీగా ఉన్న 1990 సంవత్సరం బ్యాచ్​ అధికారి రవిగుప్తా, పోలీస్ ​హౌసింగ్ ​కార్పోరేషన్ ​ఎండీగా ఉన్న 1991వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన రాజీవ్​రతన్, ఎన్నికలకు ముందు ఎలక్షన్​ కమిషన్ ​సూచనల మేరకు బదిలీ అయిన అప్పటి హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీ.వీ.ఆనంద్‌తో పాటు ప్రస్తుతం జైళ్ల శాఖ డీజీ, హోం శాఖ ప్రిన్సిపల్​ కార్యదర్శిగా ఉన్న 1992వ సంవత్సరం బ్యాచ్​ అధికారి జితేందర్ పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వీరిలో ఎవరికి డీజీపీ పోస్టు దక్కనుందో అన్న చర్చ పోలీసుశాఖలో జోరుగా నడుస్తోంది. కొంతమంది సీనియర్ ​పోలీసు అధికారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఇన్‌ఛార్జ్​ డీజీపీగా ఉన్న రవిగుప్తానే పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీలో ఉన్న ముగ్గురిలో రవిగుప్తా సీనియర్​ కావటం, వివాద రహితునిగా పేరుండటం ఆయనకు కలిసొచ్చే అంశాలను అధికారులు అంటున్నారు. రవిగుప్తా కాని పక్షంలో డీజీపీగా రాజీవ్ ​రతన్‌ను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

బీఆర్ఎస్​ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో సీ.వీ.ఆనంద్‌ను హైదరాబాద్ ​పోలీస్​ కమిషనర్​ పోస్టు నుంచి తప్పించటం గమనించాల్సిన అంశమని అంటున్నారు. హైదరాబాద్​ కమిషనర్ ​పోస్టు నుంచి ట్రాన్స్‌ఫర్ ​చేసిన ​అధికారిని డీజీపీగా నియమించే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. జైళ్ల శాఖ డీజీపీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ ​రేసులో ఉన్న అధికారుల్లో జూనియర్​ అని పేర్కొంటున్న అధికారులు ఆయనకు కూడా డీజీపీ పోస్టు రావటం కష్టమేనని అంటున్నారు. ఇక, సస్పెండ్​ అయిన అంజనీకుమార్‌ను తిరిగి సర్వీస్‌లోకి తీసుకున్న ఆయనకు డీజీపీ పోస్టు దక్కటం అసాధ్యమని చెబుతున్నారు. పోలీసు శాఖకు కొత్త బాస్​ఎవరవుతారన్నది ఇప్పటికైతే సస్పెన్స్​గానే ఉంది.


Similar News