తెలంగాణలో ప్రియాంక గాంధీ చేయబోయే ప్రకటన ఇదే: మల్లు రవి
రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి సీఎం సెక్రటరీగా నియమించుకొని లక్షన్నర రూపాయల జీతం ఇస్తూ నియమించుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి సీఎం సెక్రటరీగా నియమించుకొని లక్షన్నర రూపాయల జీతం ఇస్తూ నియమించుకున్నారని, ఇది తెలంగాణ యువతను అవమాన పరిచినట్టే అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని అన్నారు. టీపీపీఎస్సీలో 15 పేపర్స్ లీక్ అయ్యాయని, ఇంత ఘోరంగా పేపర్స్ లీక్ అయితే ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీస్కొకపోగా, అదే కమిటీ చేత మళ్ళీ పరీక్షలకు సమాయత్తం అవడం దుర్మార్గమని విమర్శించారు.
నిరుద్యోగులకు జరిగిన అన్యాయం పైన టీపీసీసీ వరస పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 8న యువ సంఘర్షణ సభ పేరుతో సరూర్ నగర్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ సభకు వచ్చి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయనుందని తెలిపారు. ఇది వరకు కాంగ్రెస్ విడుదల చేసిన రైతు డిక్లరేషన్‌లా.. నిరుద్యోగుల కోసం యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారని తెలిపారు. కేసీఆర్‌పై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఎంతో పనిచేయడానికి తెలంగాణ వారు పనికి రారా?
కాంగ్రెస్ నేత మానవతా రాయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్కరు కూడా సీఎం దగ్గర సెక్రెటరీగా పని చేయడానికి పనికి రారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తే ఇక తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. యువత పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతుంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Read More: హనుమాన్ చాలీసా కూడా బీజేపీకి అధికారం ఇవ్వదు: అద్దంకి దయాకర్