నిరుపేదల ఆకలి తీర్చేందుకే సన్న బియ్యం : మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేయడం
దిశ, పాన్ గల్ : తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పాన్ గల్ మండల పరిధిలోని రేమద్దుల, కిష్టాపూర్ తండా, గోప్లాపూర్, అన్నారం, పాన్ గల్ గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఒకప్పుడు రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే వాటిని తక్కువ ధరకు అమ్ముకునే వారని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల పై ఉచితంగా నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేసే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కింద పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 10 లక్షల వరకు వైద్య సదుపాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఎకరాకు 5000 ఉన్న రైతు భరోసా ను 6000 కు పెంచి రైతుల ఖాతాల్లో జమ చేయడం, రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ, 500 రూపాయలకే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడం జరిగిందన్నారు.
ప్రభుత్వం ఏర్పడినాటికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి పోయిందన్నారు. 65 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి కేవలం 64 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఈ అప్పులకు ప్రతినెల వడ్డీ చెల్లించడానికి 6,వేల కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందజేయడం, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రావడం జరిగింది అన్నారు. అర్హులైన వారికి మండలంలో ఎవరికైనా 2 లక్షల లోపు రుణమాఫీ కానీ వారు, 200 వరకు ఉచిత కరెంట్, 500కు సిలిండర్ రాని వారు దరఖాస్తులు ఇవ్వాలని, రాకపోవడానికి గల కారణాలు అధికారుల నుండి తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కొరకు ఎవరికి లంచం ఇవ్వరాదని ప్రజలకు సూచించారు. కొల్లాపూర్ తాలూకాకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, జనాభా ప్రాతిపదికన అన్ని మండలాలకు గ్రామాలకు మంజూరు చేస్తామన్నారు. తొలి విడతలో ఎవరికైన రానిపక్షంలో మలి విడతలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎప్పటి నుంచో ఎంతో కష్ట పడుతున్న ప్రభుత్వం నుంచి ఎన్ని ఆర్థిక సహకారాలు అందిస్తున్న ఇంకా పేదవారుగానే మిగిలిపోతున్నారని అందుకు గల కారణం విద్య, వైద్యం, ఫంక్షన్లకు ఖర్చు చేయడమేనని వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచితంగా పాఠాలు చెబుతున్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలకు పంపించి వేల రూపాయలు నష్టపోతున్నారని, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు, ఫంక్షన్ లకు ఖర్చు చేసి అప్పుల్లో మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మేలుకోవాలని, సరైన నిర్ణయం తీసుకొని ప్రతి రోజూ గంట సేపు వ్యాయామం, మంచి భోజనం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. మండలంలో ఉన్న సమస్యలు అన్ని అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ...
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా చెక్కులు పంపిణీ చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చెక్కులు అందేలా చూడాలన్నారు. చెక్కుల మంజూరులో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేతివాటం ప్రదర్శిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి జిల్లా పౌరసరఫరాల అధికారి విశ్వనాథ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో గోవిందరావు, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవికుమా,ర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.