అన్ని విభాగాలపై వారిదే పెత్తనం.. సివిల్ సప్లైస్ శాఖలో ఏళ్లుగా తిష్ట

కొంతమంది అధికారుల చర్యల వల్ల తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ రూ.కోట్లు నష్టాల్లోకి వెళ్లింది.

Update: 2024-02-22 03:07 GMT
అన్ని విభాగాలపై వారిదే పెత్తనం.. సివిల్ సప్లైస్ శాఖలో ఏళ్లుగా తిష్ట
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: కొంతమంది అధికారుల చర్యల వల్ల తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ రూ.కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. కింది నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు... రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఎఫ్​సీఐకు ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ భారీగా చేతులు మారుతున్నాయి. ఈ అక్రమ దందాపై జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు జిల్లాలో తనిఖీలు నిర్వహించి పలు రైస్​ మిల్లుల్లో నిబంధనలకు విరుద్ధంగా బియ్యం, నూకలు, వరిధాన్యం నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌ వచ్చిన వారి చేతుల్లో కార్పొరేషన్‌ బందీ అయిందనే అపవాదు ఈ శాఖ మూటగట్టుకుంది. కీలక పదవుల్లో తిష్ట వేసిన ఆ నలుగురే... కీ రోలుగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నారు. దీంతో కార్పొరేషన్‌ రెగ్యులర్‌ ఉద్యోగులు డమ్మీలుగా మారిపోపోవడంతో సంస్థ నిర్వహణ గాడి తప్పిందని తెలిసింది.

లాబీయింగ్‌...

సివిల్‌ సప్లయి శాఖ అధికారులు కేటాయించిన స్టాక్‌ మాత్రమే రైసు మిల్లుల్లో ఉండాలి. ఒక వేళ ఎక్కువ స్టాక్‌ ఉంటే అందుకు సంబంధించి రికార్డులు చూపించాల్సి ఉంటుంది. కానీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో చాలా మిల్లుల్లో వివరాలు లేవని తేలింది. అంతేకాకుండా రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందాను గుర్తించినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మామూళ్లకు అలవాటు పడి బియ్యం నాణ్యతపైనా అధికారులు నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం.

ఈ అక్రమ దందాను కప్పిపుచ్చుకునేందుకు రైస్‌మిల్లుల సంఘం నేత ఒకరు రంగంలోకి దిగి అక్రమ లావాదేవీలు బయటకు రాకుండా లాబీయింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. పరిగితో పాటు తాండూరులోని ఓ బాయిల్డ్‌ రైస్‌ మిల్లులో సీఎంఆర్‌ ధాన్యం, బియ్యం కాకుండా ఇతర సరుకు భారీ మొత్తంలో ఉండడాన్ని గుర్తించారు. వాటికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకున్నా అన్నీ సవ్యంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీంతో రైస్‌మిల్లర్లు, అధికారులు కలిసి సీఎంఆర్‌ బియ్యంలో భారీస్థాయిలో అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి.

అధికారులు మారలే...

అవినీతికి రుచిమరిగిన అధికారులు ఈ శాఖను వదిలిపెట్టడంలేదు. పౌర సరఫరాల కార్పొరేషన్‌లో జనరల్‌ మేనేజర్‌- ప్రొక్యూర్మెంట్‌ పోస్టు లేదు. మూడేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై వచ్చిన ఎం.రాజిరెడ్డి బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి అండదండలతో ఆయనకు జీఎం-ప్రొక్యూర్మెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రొక్యూర్మెంట్‌ వ్యవస్థ మొత్తం ఆయన నడిపిస్తున్నారు. లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు, వేల కోట్ల టర్నోవర్‌ అంతటికీ ఆయనే కీ రోల్​గా చక్రం తిప్పుతున్నారు.

రాజిరెడ్డి డిప్యూటేషన్‌ గడువు 2022 సెప్టెంబరులోనే ముగిసినా తిరిగి పొడిగించుకున్నారు. కార్పొరేషన్‌లోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు(ఈఈ) పోస్టును జీఎం ప్రొక్యూర్మెంట్‌గా రీ-కన్వర్ట్‌ చేశారు. ఇదే కాకుండా అత్యంత కీలకమైన ‘డీజీఎం-అడ్మిన్‌’ బాధ్యతలను ఆ అధికారికి అప్పగించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 200 మంది రెగ్యులర్, 800 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలన్నీ వీరి చేతికి అప్పగించడంపై ఇతర ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన ఆడిట్‌ ఉద్యోగికి జీఎం-ఫైనాన్స్‌ బాధ్యతలు అప్పగించి ఏండ్ల తరబడి కొనసాగిస్తుండటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యవహారంతో కార్పొరేషన్ రూ.65 వేల కోట్ల అప్పుల ఊబిలో ఉంది.

మరో మంత్రికి పీఆరోఓ...

పౌర సరఫరాల శాఖలో ప్రజా సంబంధాల అధికారిగా ఇంతకాలం విధులు నిర్వహించిన రమేశ్​ ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పీఆరోఓగా వెళ్లారు. ఈయనపై నిఘా ఉంచిన కొత్తగా కమిషనర్​గా ఛార్జ్ తీసుకున్న చౌహన్ ఈయన వ్యవహారంపై సమాచారం తెలియడంతో ఇక్కడి నుంచి తప్పించారని తెలిసింది. కార్పొరేషన్‌లో రెండు డ్రైవర్​ పోస్టులను తీసేసి పీఆర్‌ఓ పోస్టును కొత్తగా సృష్టించారు. దీన్ని సాంక్షన్‌ పోస్టుగా మార్చేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ పీఆర్‌ఓకే ‘అసిస్టెంట్‌ మేనేజర్‌-అడ్మిన్‌’ బాధ్యతలు కూడా అప్పగించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అవుట్ సోర్సు ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించారంటే ఎంతటి ఘనులు ఈ శాఖలో పనిచేస్తున్నారో అంచనా వేయవచ్చు. ఇప్పటికైనా కమిషనర్ దృష్టిసారించి ఇలాంటి అధికారులను మాతృ సంస్థలకు పంపడంతో పాటు ఈ శాఖలో మరింత నిఘాను పెంచాల్సిన అవసరం వుంది. ఇకనైనా అప్పుల్లో కూరుకుపోయిన కార్పొరేషన్​ను కొత్త కమిషనర్ గట్టెక్కిస్తారా చూడాలి!


Similar News