వారికి ఎర్రజెండా అంటే భయం : సురవరం సుధాకర్ రెడ్డి

వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే రాజకీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను చేస్తున్నారని,

Update: 2022-12-26 15:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే రాజకీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను చేస్తున్నారని, వారికి ఎర్రజెండా అంటేనే భయమని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష పునరేకీకరణ, విశాలమైన ప్రజాతంత్ర ఐక్యతను సాధించడం ద్వారా ఫాసిజాన్ని ఓడించవచ్చని ఆయన అన్నారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఎం కలయిక దోహదపడుతుందని చెప్పారు. సోమవారం సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభలో సురవరం ప్రసంగించారు.

దేశంలో ఫాసిస్ట్, మతోన్మాద పాలన కొనసాగుతోందన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారు అనారోగ్యానికి గురైతే వారిని నాటి బ్రిటిష్ సామ్రాజ్య వాదం విడుదల చేసిందని, కానీ ప్రస్తుత మోడీ ప్రభుత్వం హయాంలో తప్పుడు ఆరోపణలతో వామపక్ష వాదులను, వృద్ధులను, అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబులాంటి వారిని ఏళ్ల తరబడి జైలులోనే ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు రాజకీయాల వల్ల ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ పార్లమెంట్‌ కమ్యూనిస్టులు ఉంటే ప్రజావాణిని శక్తివంతంగా వినిపిస్తామన్నారు. ప్రతి ఏటా ప్రజాసమస్యలపై కొత్త పోరాటాలకు రూపకల్పన చేయాలని ప్రతిన బూనాలని ఆయన పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదు

దేశంలో రాజ్యాంగంపై జరుగుతున్న బహుముఖ దాడిని ఎదుర్కోకపోతే, భవిష్యత్ ఉపన్యాసాలు ఇచ్చినా రాజద్రోహం కేసు నమోదు చేసే పరిస్థితులు ఉంటాయని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ హెచ్చరించారు. మిగతా రాష్ట్రాల వారు హిందీ నేర్చుకోవాలని చెబుతున్నారని, మరి కేంద్ర మంత్రి అమిత్ కూడా తెలుగు, తమిళం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదని, త్యాగం అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజా గొంతుకగా, నూతన తరహా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని, ఏ మూలకు వెళ్లినా ఎర్ర జెండాలను కనిపించాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమర వీరుల ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, స్వాతంత్య్ర సమరయోధులు ఏటుకూరి కృష్ణమూర్తి, ఐఎస్.రాజు, సుదీర్ఘ కాలం సీపీఐ కార్యాలయ కార్యదర్శిగా పని చేసిన డి.ఎస్.రాంచందర్ రావు, మగ్దూంభవన్ 1974 నుంచి పనిచేస్తున్న చెన్నయ్య, సీఆర్. ఫౌండేషన్ చెన్నమనేని వెంకటేశ్వర్ రావులను శాలువాతో సన్మానించారు. సభో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఇ.టి.నర్సింహా, పి.జె చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News