కానరాని రూ.2 వేల నోట్ల రద్దు ఎఫెక్ట్.. తొలి రోజు అంతా ప్రశాంతం!
రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఆర్‌బీఐ ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దిశ, శేరిలింగంపల్లి: రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఆర్‌బీఐ ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2016లోనే మనుగడలోకి వచ్చిన ఈ నోట్లను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఆర్బీఐ వెల్లడించింది. ఈ నిర్ణయంతో తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లును మార్చుకునేందుకు జనాలు బ్యాంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు పెద్ద నోట్లను బయటకు తీసి వాటిని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో రూ.2 వేల నోట్లను తీసుకోలేమంటూ కొన్ని హోటళ్లు, బార్లు, వైన్స్ షాపుల వారు అప్పుడే బోర్డులు పెట్టేశాయి.
బ్యాంకుల ముందు కానరాని హడావుడి..
రెండు వేల నోట్ల మార్పిడికి నేటి నుండి అవకాశం కల్పించింది ఆర్బీఐ. అన్ని బ్యాంకుల్లోనూ ఒక్కో వ్యక్తి రోజుకు రూ.20 వేలు మార్చుకునే సౌకర్యం ఉంది. అయితే తొలరోజు శేరిలింగంపల్లి వ్యాప్తంగా అన్ని ప్రధాన బ్యాంకుల వద్ద ఎలాంటి హడావుడి కనిపించలేదు. రోజు వారి లాగే తమ శాఖలు కొనసాగుతున్నాయని, తక్కువ మొత్తంలో క్యాష్ ఉన్న వారు తమ అకౌంట్‌లో జమచేసుకోవచ్చని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతానికి రూ.2 వేల నోట్ల మార్పిడికోసం ఎవరూ రాలేదని ఆయా బ్యాంకుల మేనేజర్లు చెబుతున్నారు.
సికింద్రాబాద్, తార్నాక ప్రాంతంలో బ్యాంకుల వద్ద ఎలాంటి జనసందోహం లేదు. క్యూ లైన్లు కూడా కనిపించలేదు. ఓల్డ్ సిటీలో బ్యాంకులన్నీ యధావిధిగా కొనసాగుతున్నాయి. నోట్ల మార్పిడి కోసం ఎవరూ రాలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అంబర్ పేట్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి హడావుడి లేదు. సనత్ నగర్ నియోజకవర్గంలో బ్యాంకులన్నీ రోజువారి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎక్కడా నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీలు జరగడంలేదు. నాంపల్లి, కార్వాన్‌లోని యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పెద్దగా జనాలు లేరు.
ఇప్పటి వరకు రూ.20 నుంచి రూ. 30 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేశారనీ, సెప్టెంబర్ 30 వరకు సమయం ఉందని బ్యాంక్ అధికారులుతెలిపారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆయా బ్యాంకుల్లో కొంత మొత్తంలో రూ.2000 వేల నోట్లు డిపాజిట్ అవుతున్నాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఏటీఎంలలో కూడా రూ.2వేల నోట్లు డిపాజిట్ కూడా అవుతున్నాయి. ముషీరాబాద్ రాంనగర్ ఎస్ బి ఐ బ్యాంకు లో ఉదయం నుంచి 8 మంది వరకు రూ.2 వేల నోట్లను మార్చుకున్నారు. రూ.20 వేల కంటే ఎక్కువ ఉంటే ఖాతాలో వేసుకోవాలని బ్యాంక్ క్యాషియర్ శ్రీనివాస్ తెలిపారు.