ఎటూ తేలని కాంగ్రెస్ సీనియర్ల వైఖరి.. పాదయాత్రలో రేవంత్‌కు 'హ్యాండ్' ఇస్తారా?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన మొదలు కాంగ్రెస్‌లోని సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Update: 2023-02-12 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన మొదలు కాంగ్రెస్‌లోని సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రేవంత్ ఏ కార్యక్రమం తీసుకున్నా, వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్​చేస్తున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రలో సీనియర్లు భాగస్వామ్యం అవుతారా? లేదా? అని చర్చ జరుగుతున్నది. ఇన్ని రోజులు అసెంబ్లీ సమావేశాల్లో బీజీగా ఉన్న నేతలు ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో జరుగుతున్న రేవంత్ పాదయాత్రకు మద్దతుపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. గాంధీభవన్​వర్గాలు కూడా సీనియర్ల భాగస్వామ్యంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. అయితే ఈ నెల14 భద్రాచలంలో జరిగే యాత్రలో మాత్రం భట్టి విక్రమార్క పాల్గొనే ఛాన్స్​ఉన్నదని టీపీసీసీ సీనియర్​ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రకటించారు. మిగతా నేతలపై ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో రేవంత్ పాదయాత్ర చేయడం కూడా సీనియర్లకు ఇష్టం లేదని కాంగ్రెస్​వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.

గెలుపే లక్ష్యం..

ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్​వ్యవహారాల ఇంచార్జీ మాణిక్​రావ్​థాక్రే ఆదేశాలతో రేవంత్​పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సీనియర్లు సహకరించకున్నా, తన వర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తల్లో జోష్​నింపి పాదయాత్ర చేస్తున్నారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సీనియర్ల ఆదేశాలతో రేవంత్ పాదయాత్రకు అటెండ్ కానీ ముఖ్యనేతలు కూడా ఉన్నట్లు టీపీసీసీ వర్గం గుర్తించింది. కానీ ప్రస్తుతానికి వారిపై టీపీసీసీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు. 60 రోజుల పాటు హాథ్ సే హాథ్​తర్వాత పాదయాత్ర జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా పార్టీ పరిస్థితులపై టీపీసీసీ సమీక్షించనున్నదని పార్టీలోని ఓ కీలక నేత తెలిపారు.

థాక్రే సూచించినా అంతేనా?

టీపీసీసీ అధ్యక్షుడు చేస్తున్న హాథ్ సే హాథ్​యాత్రకు పార్టీలోని సీనియర్లు కూడా అటెండ్ కావాలని గతంలో మానిక్​రావు థాక్రే సూచించారు. వ్యక్తుల కంటే పార్టీకి ప్రాధాన్యతను ఇవ్వాలని నొక్కి చెప్పారు. కానీ రేవంత్ పాదయాత్రపై సీనియర్లు ఇప్పటి వరకు నోరు విప్పలేదు. మరోవైపు కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి ప్రగతిభవన్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కానీ పాదయాత్రలో పాల్గొనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు అసెంబ్లీ సమావేశాలు కారణంగా పాల్గొనలేదని భావించినప్పటికీ, తదుపరి కార్యచరణపై రెస్పాండ్ కాలేదు. దీంతో రేవంత్ పాదయాత్రకు సీనియర్లు దూరంగా ఉంటే ఛాన్స్ ఉన్నదని కాంగ్రెస్​పార్టీలోనే చర్చ జరుగుతున్నది.

Tags:    

Similar News