బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లో YS షర్మిల చేరికకు ముహూర్తం ఫిక్స్..!

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.

Update: 2024-01-02 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వార్త సంచలనం రేపుతోంది. వైఎస్సార్టీపీ చీఫ్, సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్.. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆంధప్రదేశ్‌పై ఫోకస్ పెట్టింది.

గతంలో పాలించిన రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు హై కమాండ్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హై కమాండ్ యోచిస్తోంది. షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. వైఎస్‌పై ఉన్న సానుభూతి, అభిమానం కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచన. అయితే, మరో రెండు, మూడు రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా డిక్లేర్ చేస్తూ ఏఐసీసీ నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టాక్. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది.

ఈ నెల 4వ తేదీన వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అదే రోజు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు సుమారు మరో 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ లోని ఓ వర్గం షర్మిల ఎంట్రీని అడ్డుకోవడంతో చివర్లో విలీనం ఆగిపోయింది. అయినప్పటికీ, షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో షర్మిలకు కీలక పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ, ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఆమె సేవలను అక్కడ వినియోగించుకోవాలని హై కమాండ్ ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News