తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్.. చర్చించే అంశాలు ఇవే..!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది.

Update: 2024-07-31 03:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్‌కు మారింది. మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంగళవారం ఉదయం ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై ఈ సమావేశం చర్చించనున్నది. ఆ తర్వాత అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనున్నది. ఈ అంశానికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీపైనా కేబినెట్ చర్చించి విధివిధానాలను, షెడ్యూలును ఖరారు చేయనున్నది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య నిర్వహించిన ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ రిక్వెస్టుపై స్పెషల్ కమిటీ ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసింది.

కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ.. అటు ప్రజల నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్దిష్టమైన విధివిధానాలను, అర్హతలను, జారీకి సంబంధించి షెడ్యూలును ఖరారు చేసే అవకాశమున్నది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర పలు అంశాలకు సంబంధించి కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.


Similar News