రెండో రోజు సాగిన ఈడీ విచారణ
టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఈడీ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది.
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఈడీ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. ఉదయం 11.30గంటల సమయంలో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. రెండో రోజు కూడా ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపైనే విచారణ జరిగినట్లు సమాచారం. బోర్డు ఉద్యోగులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి కలిసి గ్రూప్1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల సెట్లను కాన్ఫిడెన్షియల్ రూంలోని కంప్యూటర్ను హ్యాక్‌చేసి కొట్టేసిన విషయం తెలిసిందే.
ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్‌తో పాటు డీఏఓ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ప్రవీణ్నేరుగా అమ్ముకున్నట్టుగా ఇప్పటికే సిట్ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో అతనికి మొత్తం పదహారు లక్షల రూపాయలు అందినట్టుగా తేలింది. ఈ అంశంపైనే ఈడీ అధికారులు ప్రవీణ్‌ను ప్రశ్నిస్తూ లావాదేవీలు ఎలా జరిగాయని ప్రశ్నించినట్లు తెలిసింది. పది లక్షల రూపాయలను నగదు రూపంలో తీసుకున్నానని, డీఏఓ పేపర్‌కు సంబంధించి దానిని కొన్న లౌకిక్ ఆరు లక్షల రూపాయలను తన బ్యాంక్ అకౌంట్లో వేసాడని ప్రవీణ్ చెప్పినట్టుగా సమాచారం. ఇక, రాజశేఖర్‌రెడ్డి తాను గ్రూప్1 ప్రిలిమ్స్ప్రశ్నాపత్రాన్ని న్యూజీలాండ్‌లో ఉంటున్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి ఇచ్చానని, అతని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించినట్టు తెలియవచ్చింది.
ఇదిలా ఉండగా ప్రవీణ్నుంచి ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల సెట్‌ను పది లక్షల రూపాయలకు కొన్న గురుకుల టీచర్రేణుక వాటిని తన భర్త లద్యావత్డాక్యానాయక్కు ఇచ్చినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. డాక్యానాయక్ వాటిని తన బావమరిది అయిన రాజేశ్వర్ నాయక్‌కు ఇవ్వగా అతను గోపాల్‌నాయక్, నీలేష్నాయక్లకు పదమూడున్నర లక్షల రూపాయలకు అమ్మినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్‌లను కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కోర్టులో పిటిషన్దాఖలు చేయనున్నట్టు తెలిసింది.