బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ల ఉద్వాసన.. ఆయన్ను మాత్రం వదలడం లేదు!
దిశ, వెబ్‌డెస్క్: 'ట్వంటీ ట్వంటీ ఫోర్.. మోడీ వన్స్ మోర్'.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఓ విదేశీ పర్యటనలో వినిపించిన నినాదం ఇది.
దిశ, వెబ్‌డెస్క్: 'ట్వంటీ ట్వంటీ ఫోర్.. మోడీ వన్స్ మోర్'.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఓ విదేశీ పర్యటనలో వినిపించిన నినాదం ఇది. బీజేపీ ఇప్పుడు ఇదే ఫాలో అవుతోంది. రాబోయే ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా సన్నద్ధం చేసుకుంటోంది. తాజాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డును పార్టీ అధిష్టానం ప్రక్షాళన చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (65), మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (63) లను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప (77)కు స్థానం కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా నిర్ణయంతో బీజేపీ లక్ష్యం స్పష్టంగా అర్థం అవుతోందనే వాదన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యక్తి కంటే పార్టీయే ముఖ్యం అనే నినాదం తాజా ప్యానెల్‌ను బట్టి అర్థం అవుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో మోడీ, అమిత్ షా ద్వయంపై మరోసారి చర్చ ఆసక్తిగా మారుతోంది. వీరుద్దరు పార్టీని తమ గుప్పింట్లో ఉంచుకునేందుకు సీనియర్లను ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి.
మిగిలింది ఆ ఒక్కడే:
2014లో కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్టీ పూర్తిగా తమ కనుసన్నల్లో నడవాలనే దిశగా నరేంద్ర మోడీ, అమిత్ షా లు చకచకా తెర తీశారనే వాదన ఉంది. అందులో భాగంగా పార్టీలో యువ రక్తాన్ని ఎక్కిస్తామనే నినాదం పార్టీలో తెరపైకి వచ్చింది. బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారికి చోటు లేదనే నియమాన్ని అనుసరించి పార్టీలో అపార అనుభవం ఉన్న ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కీలక సీనియర్ నేతలకు మార్గదర్శక్ మండలి సభ్యులుగా కొత్త పోస్టులు క్రియేట్ చేశారు. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవిని రెన్యూవల్ చేయకపోవడంతో ఆయన సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నితిన్ గడ్కరీ, శివరాజ్ లకు ఉద్వాసన పలకగా ఒకరి విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం అవలంభిస్తున్న తీరు ఆసక్తిగా మారింది.
పార్టీ కోసమే రూల్స్:
పార్టీలో 75 ఏళ్ల నిబంధన పేరుతో అనేక మందిని పక్కన పెట్టి యడ్యూరప్ప, జతియాలకు ఈ దఫా పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవడం ఆసక్తిగా మారింది. వివిధ రాష్ట్రాల్లో రాబోతున్న ఎన్నికలతో పాటు ముఖ్యంగా సౌత్ ఇండియాపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కు ఈ బోర్డులో స్థానం కల్పించి తెలంగాణలో పార్టీకి మార్గాన్ని మరింత సుగమం చేయగా కర్ణాటకకు చెందిన 75 ఏళ్లు దాటిన యడ్యూరప్ప విషయంలో పార్టీ డిసిషన్ గమనార్హంగా మారింది. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ లింగాయత్ కమ్యూనిటీదే డిసిషన్ మేకర్స్ స్థానం. ఏజ్ ఫ్యాక్టర్ నిబంధనను పక్కన పెట్టి ఓ సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పకు అధిష్టానం అవకాశం కల్పించినా పార్టీ అవసరాల మేరకు ఇటీవల ఆయన్ను సీఎం కుర్చి నుంచి తప్పించారు. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తితో యడ్యూరప్ప రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు కీలక ప్యానల్ లోకి తీసుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గానికి పార్టీ మరింత చేరువ కావచ్చనే ఎత్తుగడకు తెరతీసింది. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే యడ్యూరప్ప విషయంలో ఏజ్ రూల్ ను పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. అవసరం అయితే పార్టీ కోసం నిబంధనలు ఉల్లఘించే వెసులుబాటును అధిష్టానం ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గెలుపే లక్ష్యంగా పక్కా స్కెచ్:
పార్టీ అధికారానికి దూరం కాకుండా ఉండేందుకు మోడీ, అమిత్ షా లు తమ పర్యవేక్షణలో పార్టీ వ్యవస్థాగత నియమకాలపై నిరంతరం ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విధంగా సత్తా చాటాలనే ఉద్దేశంతో సామాజిక, ప్రాంతాల వారీగా పార్లమెంటరీ బోర్డు కూర్పు జరిగిందనే విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ నజర్ వేసింది. కేసీఆర్ ను ఎదుర్కొవడంలో భాగంగా అవసరమైన ప్రతిసారి రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతోంది. కె.లక్ష్మణ్‌కు ఇటీవలే రాజ్యసభకు పంపగా ఆ వెంటనే పార్లమెంటరీ బోర్డులో స్థానం ఇచ్చారు. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న భూపేంద్ర యాదవ్ కు చోటు ఇవ్వగా, తొలిసారి సిక్కు వర్గానికి చెందిన జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్ పురాకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యామ్నాయ నాయకత్వ లేమితో కొట్టుమిట్టులాడుతోంది. ఈ సమస్య బీజేపీలోనూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే నితీన్ గడ్కారీని తప్పించి అదే మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే 25 ఏళ్ల సంస్థ అవసరాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉండాలని ఇటీవల హైదరబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు తీర్మాణం చేశారు. ఇందుకు అనుగుణంగా పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించే ఉద్దేశంతో భాగంగా కొత్త వారికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. బీజేపీ తాజా నిర్ణయంతో పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది విపక్షాలకు ఎంత మేర డ్యామేజ్ చేస్తుందో వేచి చూడాలి.