ఏపీ భవన్‌పై మన వైఖరేంటి?.. తెలంగాణ అధికారుల మల్లగుల్లాలు
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్) ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజించే ప్రక్రియ ఏడేండ్లుగా నలుగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్) ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజించే ప్రక్రియ ఏడేండ్లుగా నలుగుతున్నది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తెలంగాణ వ్యతిరేకించింది. కొత్త ప్రతిపాదనను వెల్లడించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వైఖరీ తీసుకోలేదు. ఈ నెల 26న ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో జరిగే రెండు రాష్ట్రాల ప్రతినిధుల సమావేశంలో దీనిపై లోతుగా చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాల్సి ఉన్నది. దీనిపై ఆ సమావేశంలో ఏం చెప్పాలనేదానిపై ఎస్సార్ (స్టేట్ రీఆర్గనైజేషన్) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యమంత్రితో దీనిపై చర్చించి నిర్దిష్ట అభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నారు.
తెలంగాణ తన వైఖరిని ఈ సమావేశంలో వెల్లడించకుంటే కేంద్ర హోంశాఖే స్పష్టమైన నిర్ణయం తీసుకుని తప్పకుండా ఆచరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించే అవకాశమున్నది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే బాధ్యత నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖదే. దీంతో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో ఈ నెల 26న కేవలం దీనిపై మాత్రమే చర్చించేందుకు సమావేశం తేదీని ఖరారు చేసింది. భవన్ విభజనపై ఆంధ్రప్రదేశ్ రూపొందించిన మూడు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరించనున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చే సూచనకు అనుగుణంగా ఢిల్లీ సమావేశంలో తెలంగాణ అభిప్రాయాన్ని హోంశాఖకు తెలియజేయనున్నారు.
ఏడు వేల కోట్ల విలువైన ప్రాపర్టీ
ఢిల్లీలోని ఏపీ భవన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు 2018 నుంచి కసరత్తు మొదలైంది. మొత్తం 19.733 ఎకరాల విస్తీర్ణమున్న స్థలాన్ని విభజన చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68శాతం), ఆంధ్రప్రదేశ్‌కు 11.32 ఎకరాల (58.32శాతం) చొప్పున దక్కనున్నది. స్థలం విలువ రీత్యా చూసుకుంటే తెలంగాణకు రూ.2,963.45 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,146.55 కోట్ల చొప్పున పంపిణీ అయ్యేలా లెక్క తేలింది. భవన్ విభజన ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రకాల ప్రతిపాదనలను చేసింది. ఈ రెండింటినీ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ పంపిణీకి అవసరమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఏ ప్రకారం విభజన జరిగినా సమ్మతమేనని ఏపీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.
భవన్ విభజమైన తెలంగాణ అభిప్రాయాలు..
భవన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడంపై తెలంగాణ వెల్లడించిన అభిప్రాయాలు, దానిపై కేంద్ర హోంశాఖ వివరణ తదితరాలను పరిశీలిస్తే...
= హైదరాబాద్ స్టేట్ (నిజాం పాలన)కు సంబంధించిన స్థలమే అయినందున ఇది పూర్తిగా ఇప్పటి తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది. రెండు రాష్ట్రాలకు పంపిణీ కావడానికి వీల్లేదు. – 23.6.2016న కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
= తెలంగాణ అభిప్రాయాన్ని తిరస్కరించిన కేంద్ర హోంశాఖ. 12.1.2017న జరిగిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. 15 రోజుల సమయం కావాలన్న తెలంగాణ ప్రభుత్వం.
= విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకే భవన్ ఆస్తుల పంపిణీ ఉంటుందని 2017 మార్చి 8న రెండు రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ క్లారిటీ
= విభజన చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం పరిష్కారం కనుగొనాలని కేంద్ర హోంశాఖకు ఏపీ ప్రభుత్వం 11.5.2017న లేఖ.
= భవన్ విభజనపై 8.1.2019న రెండు ప్రతిపాదనలను సూచించిన ఏపీ.
= కేంద్ర హోంశాఖకు రెండు ప్రతిపాదనలను సూచిస్తూ 16.5.2018న ఏపీ ప్రభుత్వం లేఖ.
= రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
= రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య 6.6.2018న తొలి సమావేశం. ఏపీ సూచించిన రెండు ప్రతిపాదనలపై చర్చ. తమ అభిప్రాయాలను వెల్లడించడానికి గడువు కోరిన తెలంగాణ
= ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ నుంచి క్లారిటీ రాకపోవడంతో వెంటనే స్పందనలను తెలియజేయాలని 15.6.2018, 21.7.2018 తేదీల్లో లేఖ రాసిన కేంద్ర హోంశాఖ.
= ఈ రెండు ప్రతిపాదనలనూ తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టులో పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 27.3.2019న అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
= తిరుపతిలో 2021 నవంబరు 14న జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆంధ్రప్రదేశ్. రెండు ప్రతిపాదనల గురించి తెలంగాణకు వివరించినా రిప్లై ఇవ్వలేదని కేంద్ర హోం మంత్రికి వివరణ.
= ఏపీ చేసిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, ఆరు వారాల్లో స్పందనను తెలియజేస్తామని హోం మంత్రికి తెలియజేసిన తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.
= నెల రోజుల వ్యవధిలోనే రిప్లై ఇవ్వాలంటూ తెలంగాణకు హోం మంత్రి ఆదేశం.
= తిరువనంతపురంలో 28.5.2022న జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలోనూ క్లారిటీ ఇవ్వని తెలంగాణ. 12.2.22న హోం సెక్రటరీతో జరిగిన చర్చ తర్వాత 23.3.22న రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటైనట్లు తెలంగాణ వెల్లడి. మరో సమావేశం 6.4.22న జరగనున్నట్లు ఏపీకి లేఖ రాసిన తెలంగాణ. ఆ తర్వాత మీటింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన.