మే 1న రేవంత్‌ను సెక్రటేరియట్‌కు రానివ్వని పోలీసులు.. ఒక్కసారిగా సీన్ రివర్స్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీ హోదాలో సచివాలయానికి వెళ్లడానికి కూడా ఆంక్షలు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అధికారులే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీ హోదాలో సచివాలయానికి వెళ్లడానికి కూడా ఆంక్షలు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అధికారులే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డిని ఈ ఏడాది మే 1వ తేదీన పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి దాదాపు కిలోమీటర్ దూరంలో టెలిఫోన్ భవన్ దగ్గర అడ్డుకుని కమిషనర్‌ను కలవనీయకుండానే పంపించివేశారు. ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు కారణాలను చెప్పకపోవడంతో రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిలదీసిన రేవంత్..
ప్రజాధనంతో పరిపాలనా అవసరాల కోసం కట్టిన సెక్రటేరియట్‌లోకి ఒక ప్రజా ప్రతినిధిగా (ఎంపీ) తనకే అనుమతి లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏందంటూ రేవంత్‌రెడ్డి నిలదీశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకోసమేనా అంటూ ముఖ్యమంత్రి వైఖరిని విమర్శించారు. ప్రజలు రకరకాల అవసరాలతో సెక్రటేరియట్‌కు వస్తారని, ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులు సైతం వస్తారని, కానీ విపక్షాలకు చెందినవారిపైనే ఆంక్షలు పెట్టడం తగదని, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక విధానమంటూ తూర్పారపట్టారు. అధికార పార్టీ నేతలు కాకపోయినా దొరికే ఎంట్రీ విపక్షాల విషయంలో భిన్నంగా ఎందుకుండాలని ప్రశ్నించారు.
పాలసీ మేకర్‌గా ఎంట్రీ..
ఆరు నెలల్లో ఈ పరిస్థితి తారుమారైంది. మే నెలలో ఎంట్రీకి కూడా నోచుకోలేకపోయిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసించే ప్రతిపక్ష ఎంపీగా నాడు చేదు అనుభవాన్ని ఎదుర్కొని ఇప్పుడు పాలసీలు రూపొందించే సీఎంగా ఎంటర్ అవుతున్నారు. ఆ రోజు అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచి సెల్యూట్‌తో సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లనున్నారు.