ఆర్టీసీ సిబ్బంది వల్లే ఆ తల్లి బిడ్డ క్షేమం.. కరీంనగర్ ఘటనపై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
కరీంనగర్ బస్టాండ్‌లో చీరలను అడ్డుగా కట్టి గర్భిణికి ఆర్టీసీ మహిళ సిబ్బంది డెలివరీ చేసిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ బస్టాండ్‌లో చీరలను అడ్డుగా కట్టి గర్భిణికి ఆర్టీసీ మహిళ సిబ్బంది డెలివరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘కరీంనగర్ బస్‌స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్‌ఆర్టీసీ మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
పరిమళించిన మానవత్వం.. సజ్జనార్
మరోవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై స్పందించారు. పరిమళించిన మానవత్వం అంటూ తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికి కాన్పు చేసిన టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయం. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడం లోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోనూ మేం ముందు ఉంటామని ఆర్టీసీ సిబ్బంది మరోసారి నిరూపించారని హర్షం వ్యక్తంచేశారు.