సర్కారుకు హైకోర్టు నోటీసులు.. దుబ్బాక ఎమ్మెల్యే పిటిషన్‌పై విచారణ

దుబ్బాక ఎమ్మెల్యే పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సర్కారుకు నోటీసులు జారీ చేసింది.

Update: 2023-02-13 17:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ విషయంలో విపక్ష సభ్యులపై వివక్ష ఉంటున్నదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సర్కారుకు నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లతో పాటు రోడ్లు-భవనాల శాఖ అధికారులకు ఈ నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నది. అధికారులు సమర్పించే అఫిడవిట్ తర్వాత దాన్ని రఘునందన్ రావు అధ్యయనం చేసి తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నది.

అధికార పార్టీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నదని, ఇతర పార్టీల సభ్యులు గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లపై వివక్ష ప్రదర్శిస్తున్నదని గత వారం దాఖలు చేసిన పిటిషన్‌లో రఘునందన్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గజ్వేల్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గాలకు అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయల మేర విడుదలవుతున్నాయని, తన నియోజకవర్గమైన దుబ్బాకకు మాత్రం మూడేళ్ళ కాలంలో ఒక్క పైసా కూడా విడుదల కాలేదని ఆ పిటిషన్‌లో గణాంకాలతో సహా వివరించారు. పార్టీల ఆధారంగా నిధుల విడుదల విధానం రూపొందడం దురదృష్టకరమన్నారు.

దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తాను గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి, ప్రధాన కార్యదర్శికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముందు అధికార పార్టీ సభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పుడు నిధుల విడుదల, అభివృద్ధి పనులు బాగానే జరిగాయని వివరించారు. ప్రత్యర్థి పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకుండా ఆర్థిక కోణం నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి వివక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 స్ఫూర్తికి విరుద్ధమైనదని ప్రస్తావించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేయాలని ఆ పిటిషన్‌లో రఘునందన్‌రావు కోరారు.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2019-20 వరకు దుబ్బాక నియోజకవర్గానికి రూ. 136.75 కోట్ల మేర ఎస్డీఎఫ్ నిధులు మంజూరైతే అందులో రూ. 95.09 కోట్లు విడుదలయ్యాయని, చివరకు రూ. 80.80 కోట్లతో సుమారు 800 రకాల పనులు పూర్తయ్యాయన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా (బీజేపీ తరఫున) గెలిచిన మూడేళ్ళలో ఒక్క పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని ఆ పిటిషన్‌లో వివరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు నిధులను ఎస్డీఎఫ్ పేరుతో ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నదని, దుబ్బాక సెగ్మెంట్‌లో జిల్లా పరిషత్ స్కూలు భవనాల నిర్మాణం, పలు స్కూళ్ళకు ప్రహరీ గోడలు, కమ్యూనిటీ హాళ్ళు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితరాలకు నిధులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ మొదలు ముఖ్యమంత్రి వరకు ఎన్ని లేఖలు రాసినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

ఫలితంగా ప్రజల కనీస అవసరాలను తీర్చలేకపోతున్నానని, ప్రజా ప్రతినిధిగా తనపై ఉన్న బాద్యతను నిర్వర్తించలేకపోతున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష కారణంగా నియోజకవర్గ ప్రజలకు సౌకర్యాలు అందకుండా పోయిందని, రాజకీయ కోణం నుంచే ఈ పక్షపాత ధోరణికి ప్రభుత్వం పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎస్డీఎఫ్ పేరుతో దుబ్బాక నియోజకవర్గానికి సైతం నిధుల్ని విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


Tags:    

Similar News