‘గురుకుల’ వెబ్ సైట్ సతాయింపు! అభ్యర్థుల పరేషాన్

గురుకులాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను వన్ టైం రిజిస్ట్రేషన్ పరేషాన్ పెట్టిస్తున్నది.

Update: 2023-04-17 02:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకులాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) పరేషాన్ పెట్టిస్తున్నది. వెబ్ సైట్ మొరాయిస్తుండడంతో పాటు ఇతర టెక్నికల్ సమస్యలతో ఓటీఆర్ చేసుకోలేకపోతున్నారు. దీనికి సోమవారంతో తుది గడువు కావడంతో 3 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లికేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి షురూ కానుంది. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల దరఖాస్తులకు సోమవారం నుంచి వచ్చే నెల 17వ వరకు అవకాశం కల్పించారు.

ఈనెల 24 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్(పీజీటీ), ఆర్ట్స్ క్రాఫ్ట్స్‌, డ్రాయింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ప్రారంభించనుంది. వచ్చే నెల 24 వరకు అప్లికేషన్ కు చాన్స్ ఇచ్చింది. వీటితో పాటు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, మ్యూజిక్ తదితర పోస్టులనూ ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017, 2018లో మొత్తం 16 వేల గురుకుల పోస్టులను సర్కార్ భర్తీ చేసింది. అప్పట్లోనూ ఇలాంటి సాంకేతిక లోపాల కారణంగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు సైతం ఈనెల 12న ప్రారంభమైన ఓటీఆర్ ప్రక్రియకు వారం గడిచినా అవాంతరాలు మాత్రం తొలగడం లేదు. ఇబ్బందులను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేసినా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు.

అప్లికేషన్ ఫీజుపైనా..

గురుకుల నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే పీజీలో 55 శాతం మార్కుల నిబంధన ఉండడంతో ఇప్పటికే అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు ఈడబ్ల్యూఎస్, కమ్యూనిటీ సర్టిఫికెట్లు పాత వాటిని కాకుండా కొత్తవి అప్ లోడ్ చేయాలని సూచించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటెక్, బీఈడీ విద్యార్థులకు సంబంధించిన అర్హత పైనా ఎలాంటి స్పష్టతనివ్వకలేదు. హిందీ, తెలుగు పండిట్ వివరాలు వెబ్ సైట్ లో లేకపోవడం వంటివి నిరుద్యోగులను టెన్షన్ కు గురిచేస్తున్నాయి. వీటికి తోడు వెబ్ సైట్ మొరాయిస్తుండటంతో ఓటీఆర్ లో నమోదు చేసుకోలేకపోతున్నారు.

అప్లికేషన్ ఫీజు పైనా నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఫీజు రూ.200గా నిర్ణయిస్తే గురుకుల బోర్డ్ ఒక్కో పేపర్ కు జనరల్ అభ్యర్థులకు రూ.1200 చొప్పున, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చొప్పున వసూలు చేయడంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పలు పరీక్ష తేదీలను మారుస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడంతో గురుకుల బోర్డు అధికారులు సైతం ఫీజు తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫీజులు తగ్గించాలని పట్టుబడుతున్నారు.

జేఎల్ ఎగ్జామ్స్ మాదిరిగానే..

గురుకుల పరీక్షలను మూడు పేపర్ల చొప్పున కాకుండా రెండు పేపర్ల విధానంలోకి మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. డీఈడీ, బీఈడీ కోర్సులు చేసిన వారిలో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకే చెందిన వారు కావడంతో వారి విద్య తెలుగులోనే కొనసాగింది. కానీ పరీక్షలు కేవలం ఇంగ్లిష్ మీడియంలోనూ ఉండటం సమస్యగా మారినట్లు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఇంటర్ కమిషనరేట్ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు తెలుగులోనే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, అదే పద్ధతిలో ఈ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని పేర్కొంటున్నారు.

బీఈడీ చివరి సెమిస్టర్ విద్యార్థులకు సైతం గురుకుల నోటిఫికేషన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గురుకుల పరీక్షలకు 4 నెలల నుంచి 5 నెలల సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన మిగతా 2 వేల పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ లో జత చేయాలని రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News