‘పైళ్ల’ గ్రాఫ్ డౌన్..! సెగ్మెంటుపై మరో ప్రజాపతినిధి నజర్?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు పట్టున్న ప్రాంతాల్లో యాదాద్రి జిల్లా ఒకటి.

Update: 2023-06-03 02:18 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు పట్టున్న ప్రాంతాల్లో యాదాద్రి జిల్లా ఒకటి. భువనగిరి సెగ్మెంట్‌లో వర్గపోరు మాట లేకుండా అధికార పార్టీ హవా కొనసాగుతూ వస్తుంది. కానీ.. ఈ మధ్య బీఆర్ఎస్ కోటకు బీటలు పడ్డాయని తెలుస్తుంది. భువనగిరి నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా..? ఆయన గ్రాఫ్ డౌన్‌లోకి వెళ్తుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది.

అసంతృప్తిలో సొంత క్యాడర్

ఎమ్యెల్యే పార్టీని బలోపేతం చెయ్యడమే కాకుండా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే.. ఇటీవల కొన్ని పరిణామాలతో వర్గపోరు చాప కింద నీరులా పాకుతుంది. పార్టీలో కొత్తగా చేరిన పలువురికి ఎమ్యెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని, ముందు నుంచి వెంట ఉన్న వారిని దూరం పెడుతున్నాడని, దీంతో ఓ వర్గం అసంతృప్తితో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొదట్నించి ఒకే సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల వలిగొండ, రామన్నపేట మండలాలకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ సామాజిక వర్గ వ్యక్తికి ఇస్తున్నారనేది తెలియడంతో సొంతపార్టీకి చెందిన ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్యెల్యేకు వ్యతిరేకంగా రహస్యంగా భేటీ అయ్యారు. గెలిచిన నాటి నుంచి ఎమ్యెల్యే అందుబాటులో ఉండరని.. ఎన్నికలు సమీపిస్తుండడంతోనే విస్తృతంగా పర్యటిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. నిరసన తెలిపిన ఆర్ఆర్ఆర్ భూ బాధితులపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయించినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఇక జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్యెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ జోరుగా ఉంది.

బడానేత అండతో ఓ ప్రతినిధి ఫోకస్

ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యే గ్రాఫ్ డౌన్ అవుతుందని బాహాటంగానే వినిపిస్తుంది. వచ్చేసారి చాన్స్ వస్తుందా..? లేదా.. అనుమానాలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కింగ్ మేకర్‌గా పేరున్న ఓ బడా నేత అండదండలతో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తుంది. రాజకీయ నేపథ్యం ఉన్న ఆ నేత వర్గం సైతం ఎమ్మెల్యేతో అంతర్గతంగా దూరం పాటిస్తూ వస్తున్నారనే చర్చలు ఉన్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని ధృడ నిశ్చయంతో ఉన్న పైళ్ల శేఖర్ రెడ్డికి సొంత పార్టీ నేతలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక పవనాలను ఎదురొడ్డి నిలుస్తారా..? లేదా అని వేచి చూడాలి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..