కొడంగల్ ప్రజలకు గుడ్ న్యూస్.. ‘కడ’కు భారీగా నిధుల విడుదల

కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడ) అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 43.75 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

Update: 2024-10-18 15:00 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడ) అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 43.75 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసి అభివృద్ధి కోసం వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు, కడ స్పెషల్ ఆఫీసర్ల సారధ్యంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. ఇందులో భాగంగా కడ అభివృద్ధి కోసం మొదటగా 120 కోట్ల రూపాయల అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కాగా వివిధ పనులు చేపట్టారు. రెండవ విడతగా 43.75 కోట్ల రూపాయలను ప్రభుత్వము విడుదల చేసింది.

ఈ నిధులతో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న వివిధ పాఠశాలలు, అంగన్వాడీల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఇవే నిధులతో నూతనంగా ఏర్పడిన దుద్యాల మండల కేంద్రంలో 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించనున్నారు. కడ అభివృద్ధి కోసం నిధులు మంజూరు కావడం పట్ల కొడంగల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News