కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు రద్దు
కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన ఏడుగురు
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 7వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఆఫీసుల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతోనే చాలా మంది రాజీనామా చేసినా ఇంకా కొందరు కొనసాగుతూ ఉండడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలోని మొత్తం 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పోస్టుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో వారు ఇక రాజీనామా చేయకుండానే ఇంటిబాట పట్టాల్సి వస్తున్నది. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాసయాదవ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, వికలాంగుల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కల్లుగీత సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్రెల-మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రజని (సాయిచంద్ భార్య) తదితర మొత్తం 54 మంది పదవులు రద్దయ్యాయి.
BREAKING: బీసీ బంధు స్కీమ్ నిలిపివేత: మంత్రి పొన్నం కీలక ప్రకటన