స్థానిక ఎన్నికలపై వేగం పెంచిన ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్వేగం పెంచింది.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్వేగం పెంచింది. విలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను మరో సారి ఆప్డేట్చేసే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. గత యేడాది 86 గ్రామ పంచాయతీలను సమీపంలోని కార్పొరేషన్లలో విలీనం చేయడం లేదా కొత్త మున్సిపాలిటి చేయడం, సమీప మున్సిపాలిటిలో విలీనం చేశారు. ఆ గ్రామాలను తిసి వేసి ఆయా మండలాలు కొత్త ఓటరు జాబితాను, గ్రామం, వార్డుల వారిగా తాజాగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో సూచించారు. సప్లమెంటరీ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3లోగా ప్రకటించాలని సూచించారు.
వీటిపై అభ్యంతరాలను స్వీకరించాలని, అభ్యంతరాలను పరిశీలించాలని సూచించారు. ఫిబ్రవరి 4న ఎంపీడీవో మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరి 6న సప్లమెంటరీ ఓటరు తుది జాబితాను ప్రకటించాలని సూచించారు. వీటితో పాటుగా గతంలో గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ప్రకటించిన సమయంలో వివిధ కారణాలతో 64 గ్రామ పంచాయతీల్లో రూపొందించలేదు. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఓటరు జాబితాను తయారు చేయాలని ఎన్నికల కమిషన్గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 3న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించాలని, దీనికి తాజాగా ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరుజాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. 4న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని, 5వ తేదీ కల్లా అభ్యంతరాలను స్వీకరించాని, 6న వాటిని పరిష్కరించాలని, 7న తుది ఓటరు జాబితాను 64 గ్రామాల్లో ప్రకటించాలని సూచించారు.
నాలుగు రోజుల్లో ఎంపీటీసీల విభజన...
ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండే విధంగా ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకవచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండే విధంగా విభజన చేయాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఫిబ్రవరి 3 కల్లా విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం కల్లా అభ్యంతరాలను స్వీకరించాలని, ఫిబ్రవరి 2 కల్లా అభ్యంతరాలను పరిశీలించిన పరిష్కరించాలని, ఫిబ్రవరి 3న తుది ఎంపీటీసీ పరిధి జాబితాను ప్రకటించాలని ఆదేశించారు.