మనీ లాండరింగ్ చట్టానికి మరింత పవర్.. ఇకపై ఆడిటర్లూ బాధ్యులే!
చార్టడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్లకు కొత్త సవాళ్లు వచ్చి పడ్డాయి. ప్రొఫెషనల్ హోదాలో పని చేస్తున్న వారు ఇక నుంచి తమ క్లయింట్లపై వచ్చే అవినీతి ఆరోపణలు, అక్రమ ఆదాయల ఫిర్యాదులకు జవాబుదారీగా ఉండాల్సిందే.
దిశ, తెలంగాణ బ్యూరో: చార్టడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్లకు కొత్త సవాళ్లు వచ్చి పడ్డాయి. ప్రొఫెషనల్ హోదాలో పని చేస్తున్న వారు ఇక నుంచి తమ క్లయింట్లపై వచ్చే అవినీతి ఆరోపణలు, అక్రమ ఆదాయల ఫిర్యాదులకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఈ మేరకు మనీ లాండరింగ్ చట్టంలోని నిబంధనలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది. సెక్షన్ ఎస్ఏలోని సబ్ క్లాజ్ 6, సబ్ సెక్షన్ 1కు సవరణలు చేస్తూ రెండు రోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ (నం. సీజీడీఎల్ఈ-03052023) జారీ చేసింది. చట్టం ఉల్లంఘనకు పాల్పడితే క్లయింట్లతో పాటు వారూ ప్రాసిక్యూషన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
జవాబుదారీ వహించక తప్పదు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పని చేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ నిందితుడిగా చేర్చింది. ఎంక్వయిరీకి పిలిచిన ఈడీ ఆయన స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నది. ప్రొఫెషనల్ హోదాలో సౌత్ గ్రూపునకు లిక్కర్ పాలసీ విషయంలో సర్వీస్ అందించినట్లు ఆయన తరఫు న్యాయవాది రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్‌లో బుచ్చిబాబుకు ఎలాంటి ప్రమేయం లేదని, లైసెన్సులు పొందలేదని, వ్యాపార భాగస్వామిగా లేరని, కేవలం ప్రొఫెషనల్ రూపంలో సలహాలు, సూచనలు మాత్రమే చేశారని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఆడిటర్లూ వారి క్లయింట్ల తప్పులకు జవాబుదారీ వహించక తప్పదని, ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొనడం గమనార్హం.
సర్వీస్ విషయంలో జాగ్రత్తలు
కేంద్ర ఆర్థిక శాఖ చేసిన సవరణలో చార్టర్డ్ అకౌంటెంట్లు ఇకపై క్లయింట్లకు సర్వీస్ అందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వారికి సంబంధించిన పూర్తి వివరాలను గమనంతో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకాలం ప్రొఫెషనల్ సర్వీస్ అనే హోదాతో క్లయింట్లు చేసే అవినీతి, అక్రమాలతో చార్టర్డ్ అకౌంటెంట్లకు సంబంధం ఉండేది కాదు. వారు ఎలాంటి ప్రాసిక్యూషన్‌నూ ఎదుర్కొనే అవసరం ఉండేది కాదు. ఇకపై వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. క్లయింట్లు జరిపే ఆర్థిక లావాదేవీలు, భూ క్రయ విక్రయాలు, బ్యాంకుల్లో డిపాజిట్లు, సేవింగ్స్, సెక్యూరిటీల మారకం, కంపెనీల నిర్వహణ, వాటి విలీనాలు, అమ్మకం, ట్రస్టుల నిర్వహణ..వంటి వ్యవహారాలన్నింటికీ సీఏలు, సీఎస్‌లు, సీడబ్ల్యుఏలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్లయింట్లు చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకూ ఆడిటర్లుగా వారే జవాబుదారీ అవుతారు.
ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందే..
ఇప్పటికే మనీ లాండరింగ్ చట్టానికి విస్తృత అధికారాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 14 రకాల దర్యాప్తు సంస్థల వ్యవహారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆయా దర్యాప్తు సంస్థలకు లభించిన ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ స్టేటస్ తదితరాలన్నింటినీ ఈడీకి అవసరాన్ని బట్టి తెలియజేయడం అనివార్యమైంది. తాజాగా ఆడిటర్లనూ జవాబుదారీ చేసేలా చట్టంలో సవరణలు చేయడంతో వారు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తున్నది. క్లయింట్లు వివాదాల్లో చిక్కుకుంటే వారితో పాటు ఆడిటర్లూ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ క్లయింట్లకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి..వాటికి చట్టబద్ధత ఎంత, చివరకు అవి ఎటు వెళ్తున్నాయి ? వంటి వివరాలన్నీ ఆడిటర్ల కనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుంది.
నివేదిక సమర్పించాల్సిందే..
ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టరేట్ నిరంతరం కంపెనీల ఆర్థిక లావాదేవీలపై నిఘా వేస్తూ ఉంటుంది. సీఏలు, సీఎస్‌లు, సీడబ్ల్యుఏలు ఎప్పటికప్పుడూ క్లయింట్ల ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్వహణకు సంబంధించిన అంశాలను క్రోడీకరిస్తూ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త రూల్స్‌ను ఉల్లంఘిస్తే ప్రొఫెషనల్స్ అయినా దర్యాప్తు ఎదుర్కోక తప్పదు. క్లయింట్లపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు అనంతరం మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే వారికి ప్రొఫెషనల్‌గా సేవలందించే పేరుతో సహాయం చేశారనే అపవాదును ఆడిటర్లు మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాతిపదికన వీరు దర్యాప్తునకు సిద్ధం కాక తప్పదు. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, దేశం మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ నాయకుల అఫిడవిట్లలోని ఆస్తుల వివరాలపై సర్టిఫికెట్ ఇచ్చే సీఏలు అదనపు జాగ్రత్తలు తీసుకుని ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read More: ద్రవ్యోల్బణం నియంత్రణకు భారత్ కృషి చేస్తోంది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్